ఓటీటీ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి రానా చెప్పిన విశేషాలు..!

Update: 2022-03-03 03:35 GMT
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ రూపొందించే ''రానా నాయుడు'' అనే యాక్షన్ డ్రామా సిరీస్‌ తో దగ్గుబాటి ద్వయం విక్టరీ వెంకటేష్ మరియు హ్యాండ్సమ్ హంక్ రానా డిజిటల్ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'భీమ్లా నాయక్' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రానా.. తన డెబ్యూ ఓటీటీ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు.

రానా మాట్లాడుతూ.. ''ఓటీటీ ప్రాజెక్ట్‌ కోసం ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు మేము 12 గంటల షిఫ్టులలో పని చేస్తున్నాము. మేము సౌత్ కు అలవాటు పడిన దానికంటే చిత్రీకరణ ప్రక్రియ చాలా క్రమశిక్షణతో కూడుకున్నది'' అని రానా అంటున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ లో సినిమా షూటింగులు 8-9 గంటల పాటు సాగుతాయి. అలాగే స్టార్స్ కు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.

కానీ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ వర్కింగ్ మోడల్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందని రానా చెప్తున్న దాన్ని బట్టి అర్థం అవుతోంది. ''నేను సాధారణంగా నా ప్రాజెక్ట్‌ లతో ప్రయోగాలు చేస్తాను. బాబాయి రీమేక్ సబ్జెక్ట్‌ లను ఎంచుకుంటాను. కానీ ఈ నెట్‌ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ మా ఇద్దరికీ పూర్తిగా భిన్నమైన జోన్‌ లో ఉంది. ఇలాంటి పని చేయడం ఒక క్రేజీ అనుభవం'' అని రానా అన్నారు.

నేను నెట్‌ ఫ్లిక్స్‌ తో ఇరవై పేజీల ఒప్పందంపై సంతకం చేశాను. ఈ నిబంధనలను ఉల్లంఘించలేను కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడలేను అని రానా దగ్గుబాటి తెలిపారు.  

కాగా, అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా ''రానా నాయుడు'' వెబ్ సిరీస్ రూపొందుతోంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ క్రైమ్-డ్రామాలో వెంకటేష్ - రానా మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

పాటలు ఫైట్స్ లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతానని తన తండ్రి సురేష్ బాబుతో చెబుతుంటానని పేర్కొన్న రానా.. ఇకపై అలాంటి ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌ చెబుతుందని ఓ డిస్ట్రిబ్యూటర్‌ తనకు చెప్పాడని.. అప్పుడే విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చిందని రానా అన్నారు.

ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తానని.. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసిందని రానా తెలిపారు. ప్రస్తుతం రానా నటించిన 'విరాటపర్వం' అనే సినిమా రిలీజ్ కు రెడీ అయుంది. ఇదే క్రమంలో ఓ మల్టీలాంగ్వేజ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.
Tags:    

Similar News