రంగనాథ్ రాసిన అద్భుతమైన కవిత

Update: 2015-12-20 04:31 GMT
రంగనాథ్ రాసిన అద్భుతమైన కవిత
  • whatsapp icon
తెలుగు పరిశ్రమ మరో మంచి నటుడిని, వ్యక్తిని కోల్పోయింది. రంగనాథ్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. పండితుల కుటుంబంలో పుట్టిన ఆయన బాగా చదువుకున్నారు. సరళమైన భాషతో అద్భుతమైన కవితలు రాసేవారాయన. ఆయన రాసిన కవితలు - జీవిత సూత్రాలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా తాను రాసిన ఓ కవిత గురించి ఓ ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకున్నారు రంగనాథ్. ఆ కవిత వింటే కళ్లు చెమ్మగిల్లడం ఖాయం.

‘‘అప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు

అమ్మానాన్న మాటలన్నీ విన్నాను

ముద్దొచ్చే నుదిటి కుంకుమ తానవ్వాలని

పట్టుకుచ్చులాంటి జెడపై పూలదండ కావాలని

ఆదరించే అమ్మ చేతుల్ని గాజులై బంధించాలని

తెగ పొగిడేవాడు నాన్న

అబ్బా.. అమ్మ అంత అందమైనదా అని

అంత అందమైన అమ్మను

నేనెప్పుడు చూడటమా అని ఆరాటపడ్డాను

ఇప్పుడు నేను పుట్టాను

అమ్మను చూశాను

నిజమే! అమ్మ అందమైనదే!

కానీ, నుదిటి కుంకుమ

జడలో పూదండ

చేతులకు గాజులు

అన్నీ అబద్ధాలు

నాన్న పోయాడట

అవన్నీ తనకిష్టమని పట్టుకుపోయాడట’’

... ఇదీ రంగనాథ్ ‘అందమైన అమ్మ’ పేరుతో రాసిన కవిత. ఒకసారి ఓ మిత్రుడి ఇంటికి వెళ్లానని.. అతడి భార్య తన కవితలు బావుంటాయంటూ ఓ కవిత చెప్పమని అడిగిందని.. ఈ కవిత చెప్పగానే ఆమె బోరున ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయిందని..మళ్లీ రాలేదని చెప్పారు రంగనాథ్.
Tags:    

Similar News