అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రంగనాథ్

Update: 2015-12-20 04:27 GMT
తన మాటలతో, కవితలతో ఎందరికో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రంగనాథ్. ఫేస్ బుక్ - వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఈ తరం యువతీ యువకులు కూడా ఆయన జీవిత పాఠాల్ని షేర్ చేయడం చూస్తుంటాం. అలా ఎందరిలోనో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతి పెద్ద విషాదం. భార్య మంచాన పడితే పదిహేనేళ్ల పాటు ఎంతో నిబ్బరంతో సేవలు చేసిన వ్యక్తి ఆయన. ఆమె తదనంతరం కూడా నిబ్బరం కోల్పోకుండా ఉంటూ నాకొచ్చే డబ్బులతో చాలా దర్జాగా బతుకుతున్నానిప్పుడు అని ‘ఓపెన్  హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో హుందాగా ప్రకటించిన వ్యక్తి.. ఇప్పుడిలా తనువు చాలిస్తాడని ఎవరూ ఊహించలేదు.

ఐతే అదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. యువకుడిగా ఉన్నపుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతిని గుర్తు చేసుకున్నాడు రంగనాథ్. చావు అంచుల దాకా వెళ్లి వెనక్కి వచ్చేసిన ఆ అనుభవం గురించి ఆ కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతూ.. ‘‘నాకో ప్రాణ స్నేహితుడుండేవాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నాకు పెళ్లయ్యాక కూడా మా భార్యాభర్తలిద్దరికీ ఏవైనా కంప్లయింట్లుంటే అతడికే చెప్పుకునేవాళ్లం. ఐతే కొన్నాళ్లకు అతను ఎయిర్‌ ఫోర్స్‌ కు వెళ్లిపోయాడు. ఇక ఎవరూ లేరే అని బాధ కలిగింది. ఆ సమయంలో ఎందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తిరుపతి నుంచి ఓ ట్రైన్‌ వస్తుందని తెలిసి.. పట్టాల ముందు కూర్చున్నాను. అయితే బండి రావడం ఆలస్యమైంది. ఆ సమయంలోనే నేను ఆర్టిస్టు కావాలన్న అమ్మ కోరిక నెరవేర్చకుండా చనిపోవడం ఏంటి అనుకున్నాను. వెంటనే ఇంటికొచ్చేశాను’’ అని చెప్పారు రంగనాథ్. ఇలా ఒకప్పుడు తాను చేసిన పొరబాటు గురించి చెప్పిన ఆయనే ఇప్పుడు అదే తప్పు చేసి తన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు విషాదం మిగిల్చారు.
Tags:    

Similar News