రంగస్థలం.. మామూలు రికార్డు కాదు

Update: 2018-07-07 11:41 GMT
100 కేంద్రాల్లో 50 రోజులు.. 50 సెంటర్లలో వంద రోజులు.. 25 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ.. ఒకప్పుడు ఇలాగే ప్రచారం చేసుకునేవాళ్లు నిర్మాతలు. సినిమాల విజయానికి కొలమానం 50-100-175 రోజుల సెంటర్లే అయ్యేవి. కానీ ఆ తర్వాత కేంద్రాలు పోయి కలెక్షన్ల మీద పడ్డారు. అవే సినిమా విజయాన్ని నిర్దేశిస్తున్నాయి. సినిమాలకు లాంగ్ రన్ పోయింది.  ఒకేసారి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి ఒకట్రెండు వారాల్లోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకునే పద్ధతి మొదలైంది. దీంతో 50 రోజులు.. వంద రోజులు అనే మాటలే వినిపించడం లేదు. ఇలాంటి రోజుల్లో కూడా ఒక సినిమా ఏకంగా 15 సెంటర్లలో వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఆ చిత్రమే.. రంగస్థలం. 15 కేంద్రాలని తక్కువగా చూడటానికి లేదు. ఈ రోజుల్లో ఒక్క సెంటర్లో వంద రోజులు ఆడటం కూడా కష్టంగా ఉంది. అభిమానులు పనిగట్టుకుని ఆడిస్తే తప్ప వంద రోజుల సెంటర్లు పడటం లేదు.

అలాంటిది జెన్యూన్ గా ‘రంగస్థలం’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 సెంటర్లలో వంద రోజులు ఆడేసింది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ సహా మొత్తం 15 చోట్ల వంద రోజులాడింది. తెలంగాణలో మరో మూడు కేంద్రాల్లో.. రాయలసీమలో రెండు చోట్ల.. ఆంధ్రాలో 9 సెంటర్లో ఈ చిత్రం వంద రోజులాడింది. ఇలాంటి విజయాలు పరిశ్రమకు ఎంత ఊపునిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బలమైన కథాకథనాలు ఉంటే సినిమాల్ని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని.. థియేటర్లకే వచ్చి చూస్తారని ఈ చిత్రం రుజువు చేసింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 50 రోజుల వరకు మంచి ఆక్యుపెన్సీతో నడిచిందీ చిత్రం. ఆ తర్వాత కూడా డెఫిషిట్ లేకుండా రన్ అవుతూ వచ్చింది. తెలుగు సినీ చరిత్రలోనే ‘రంగస్థలం’ ఒక ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News