'జయేష్‌ భాయ్ జోర్దార్' ట్రైలర్: పుట్టబోయే బిడ్డను రణవీర్ రక్షించుకుంటాడా..?

Update: 2022-04-19 11:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌ వీర్ సింగ్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. 'రామ్ లీలా' 'బాజీరావ్ మస్తానీ' 'పద్మావత్' 'సింబా' 'గల్లీ బాయ్' '83' వంటి చిత్రాలు రణవీర్ ను మిగతా హీరోల కంటే ప్రత్యేకంగా నిలుపుతాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సింగ్.. ఇప్పుడు ''జ‌యేశ్ భాయ్ జోర్దార్'' అనే చిత్రంతో అలరించడానికి వస్తున్నాడు.

''జయేష్‌ భాయ్ జోర్దార్'' చిత్రంలో రణవీర్ సింగ్ సరసన 'అర్జున్ రెడ్డి' ఫేం షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. బోమన్ ఇరానీ - రత్నా పాటక్ షా - జై వైద్య కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'ఈ నా తండ్రి.. మా గ్రామానికి స‌ర్పంచ్‌.. ఆయ‌న త‌ర్వాత నేను.. మరి నా త‌ర్వాత ఎవ‌రనే టెన్ష‌న్..' అంటూ రణ్ వీర్ సింగ్ వాయిస్ ఓవ‌ర్‌ తో ఈ ట్రైల‌ర్‌ ప్రారంభమైంది. జ‌యేశ్ భాయ్(రణవీర్) తండ్రి గ్రామానికి స‌ర్పంచ్‌ అవ్వడంతో.. అతని తర్వాత కొడుకు సర్పంచ్ అవుతాడు. దీన్ని వారసత్వంగా కొన‌సాగించేందుకు మ‌న‌వ‌డు కావాల‌ని కోరుకుంటున్న సమయంలో రణవీర్ - షాలినీ పాండే దంపతులకు మొదటి సంతానంగా కూతురు పుడుతుంది.

అయితే రెండోసారి కూడా తనకు ఆడపిల్ల పుట్టబోతోందని తెలుసుకున్న జయేష్.. మ‌న‌వ‌డు పుడతాడని కలలుకంటున్న తండ్రి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నార‌న్న క‌థాంశంతో ఆహ్లాదకరంగా సాగిన 'జయేష్‌ భాయ్ జోర్దార్' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో పితృస్వామ్య వ్యవస్థకు ఎదురు తిరిగే వ్యక్తిగా రణ్‌ వీర్ కనిపిస్తున్నాడు.

వంశానికి వారసుడు కావాల్సిందేనని పట్టుబట్టిన తన కుటుంబం నుంచి భార్యా కుమార్తెలను.. పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించే గుజరాతీ పాత్రలో రణ్‌ వీర్ మెప్పించాడు. ఇది అతని కెరీర్ లో మరో విలక్షణమైన పాత్రగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు గ్లామ‌ర‌స్ రోల్స్ లో నటించిన షాలినీ పాండే.. ఈ సినిమాలో సాధారణ గృహిణి పాత్రలో స‌రికొత్త‌గా క‌నిపిస్తోంది. ఇక జయేష్ ను ఇబ్బంది పెట్టే తండ్రి పాత్రలో బొమన్ ఇరానీ నటించారు.

ఫన్నీగా ఉన్నప్పటికీ ఇందులో పితృస్వామ్య వ్యవస్థ మరియు ఆడ పిల్లలను చిన్నచూపు చూసే సమాజం గురించి.. భ్రూణహత్యల అంశాన్ని హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిల్మ్స్  సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మనీష్ శర్మ నిర్మించారు. దివ్యాంగ్ ఠాకూర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. విశాల్ - శేఖర్ సంగీతం సమకూర్చారు. ''జ‌యేశ్ భాయ్ జోర్దార్'' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2022 మే 13న థియేటర్లలోకి రాబోతోంది.


Full View
Tags:    

Similar News