మేము మంచి చూపిస్తున్నాం.. మీరు చెడు చూడకండి

Update: 2019-04-17 13:10 GMT
తెలుగు బుల్లి తెరపై సంచలన విజయాన్ని దక్కించుకున్న జబర్దస్త్‌ ఏ స్థాయిలో టీఆర్పీని దక్కించుకుంటుందో, అదే స్థాయిలో విమర్శలను కూడా మూట కట్టుకుంటుంది. కామెడీ పేరుతో బూతులు మాట్లాడుతున్నారని, పిల్లలు ఈ షో చూసి పాడైపోతున్నారు అంటూ చాలా కాలంగా ఈ షో గురించిన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ షోకు యాంకర్‌ లుగా వ్యవహరిస్తున్న రష్మీ మరియు అనసూయలతో పాటు జడ్జ్‌ లుగా వ్యవహరిస్తున్న నాగబాబు మరియు రోజాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారు ఎక్కడకు వెళ్లినా కూడా జబర్దస్త్‌ వివాదంకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

తాజాగా యాంకర్‌ రష్మీ మంచిర్యాలలో ఒక షాపింగ్‌ మాల్‌ ను ప్రారంభించేందుకు వెళ్లింది. అక్కడ మీడియాతో ముచ్చటించింది. ఆ సందర్బంగా ఆమెకు జబర్దస్త్‌ విమర్శలపై ప్రశ్న ఎదుర్కొంది. ఆ సమయంలో రష్మీ సమాధానంగా.. జబర్దస్త్‌ పై కాంట్రవర్సీలు చాలా వస్తున్నాయి, అయితే ఆ కాంట్రవర్సీలు మేము చేస్తున్నవి కాదు, మీరు క్రియేట్‌ చేస్తున్నవి. మేము జబర్దస్త్‌ ద్వారా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించాలని భావిస్తున్నాం. దాన్ని మీరు ఎలా చూస్తే అలా ఉంటుంది. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కోణంలో చూస్తే బాగానే ఉంటుంది. కాని కొందరు దాన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నారు. అందుకే విమర్శలు వస్తున్నాయి.

జబర్దస్త్‌ ప్రైమ్‌ టైంలో వస్తుంది. ప్రైమ్‌ టైం అనేది అడల్ట్స్‌ కోసమే, ఆ సమయంలో టీవీ చూసే వారు విచక్షణతో వ్యవహరించి, షోలోని మంచిని తీసుకోవాలి. మంచిని, చెడును ఫిల్టర్‌ చేసే సెన్స్‌ ఉండాలి. ఆ కెపాసిటీ ఉన్న వారు జబర్దస్త్‌ గురించి విమర్శలు చేయరు. కాస్త లోతుగా ఆలోచించి మాట్లాడితే జబర్దస్త్‌ గురించి ఎలాంటి విమర్శలు ఉండవంటూ రష్మీ చెప్పుకొచ్చింది. జబర్దస్త్‌ కారణంగా రష్మీకి స్టార్‌ హోదా దక్కింది. హీరోయిన్‌ గా నటించే అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అందుకే జబర్దస్త్‌ ను ఒక్క మాట అంటే ఈ అమ్మడు ఊరుకోవడం లేదు.
Tags:    

Similar News