బంటీ వెర్సస్ బడా స్టార్లు.. గెలిచేదెవరు?

Update: 2018-11-06 06:50 GMT
టాలీవుడ్లో ఒక పెద్ద పండుగ వస్తోందంటే.. సినిమాల సందడి బాగానే ఉంటుంది. దీపావళి సందర్భంగానూ ఒకటికి మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. కాకపోతే అందులో పేరున్న పెద్ద తెలుగు సినిమా ఏదీ లేదు. రెండు భారీ అనువాద చిత్రాలతో ఓ చిన్న సినిమా తలపడుతుండటం విశేషం. రవిబాబు దర్శకత్వంలో ఓ పంది పిల్ల హీరోగా తెరకెక్కిన ‘అదుగో’ బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ అనదగ్గ రవిబాబు.. చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.

‘అవును-2’ తర్వాత అతడి కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. గ్రాఫిక్స్.. ఇంకొన్ని కారణాల వల్ల ‘అదుగో’ బాగా లేటైంది. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. పంది పిల్లను హీరోగా పెట్టి సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. రవిబాబు కొంచెం రూటు మార్చి ఇలా ప్రయోగం చేసిన ప్రతిసారీ మంచి విజయమే అందుకున్నాడు. ఇందులో బంటీగా పంది పిల్ల చేసే విన్యాసాలే హైలైట్ అంటున్నారు. మరి ‘అదుగో’ కూడా అలాంటి ఫలితాన్నే అందిస్తుందేమో చూడాలి.

ఇక పండక్కి రాబోతున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది డబ్బింగ్ సినిమా అయినా ‘సర్కార్’ మీదే. ఇంతకుముందు విజయ్ సినిమా అంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు తెలుగులో. కానీ గత కొన్నేళ్లలో అతడి సినిమాలు ఓ మోస్తరుగా ఆడి మార్కెట్ పెరగడం.. మరోవైపు మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో క్రేజ్ వచ్చింది. ఓ డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో దీనికి బుకింగ్స్ జరుగుతున్నాయి. మంగళవారమే ఈ చిత్రం రిలీజవుతోంది. ఇంకోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన హిందీ అనువాదం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సైతం తెలుగులో విడుదలవుతుండటం విశేషం. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News