పవన్ డైరెక్టర్ కి నో చెప్పిన రవితేజ?

Update: 2016-07-14 05:24 GMT
మాస్ మహరాజ్ రవితేజ స్ట్రాటజీ ఏంటో ఇండస్ట్రీ జనాలకు అర్ధం కావడం లేదు. గతేడాది డిసెంబర్ 10న సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన బెంగాల్ టైగర్ తో రవితేజ మంచి హిట్ నే కొట్టాడు. అప్పటి నుంచి 7 నెలలు గడిచిపోయినా.. ఇప్పటివరకూ ఒక్క సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏడాది 3-4 సినిమాలు రిలీజ్ చేసేయగల ఎనర్జీ ఉన్న ఈ హీరో.. అసలు మొదలు పెట్టడానికే ఆలస్యం చేసేస్తున్నాడు.

రీసెంట్ గా తనతో పవర్ మూవీని తీసిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీకి మాస్ మహరాజ్ సినిమా ఆఫర్ ఇచ్చాడనే వార్తలొచ్చాయి. ఇప్పుడా ప్రాజెక్ట్ కూడా అటకెక్కేసిందని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ తో డీలా పడ్డ బాబీకి.. పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు రవితేజ. కానీ ముందు చెప్పిన లైన్ ఓకే అనిపించినా.. బాబీ.. కోన వెంకట్ లు ఇద్దరూ కలిసి తయారు చేసిన ఫైనల్ స్క్రిప్ట్ ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయిందట. ఇదే ఫైనల్ అనుకుంటే.. నేనీ మూవీ చేయనని బాబీకి తెగేసి చెప్పేశాడట రవితేజ.

బెంగాల్ టైగర్ తర్వాత దిల్ రాజు తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ రాబిన్ హుడ్ అన్నారు కానీ., ఇంకా పట్టాలెక్కలేదు. నిర్మాతలు మారడం లాంటివి జరగడంతో దీనిపై కూడా అనుమానాలున్నాయి. ప్రస్తుతం రమేష్ వర్మతో ఓ స్టోరీ గురించి మాటలు జరుగుతున్నా.. అది కూడా ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.
Tags:    

Similar News