వైజాగ్ బీచ్ లో చరణ్ .. కియారా కూడా తయారు !

Update: 2022-05-07 02:30 GMT
చరణ్ ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' .. మరో వైపున 'ఆచార్య' చేశాడు. రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ ఏ పాత్రకు తగినట్టుగా ఆ పాత్రలోఒదిగిపోవడం అంత తేలికైన విషయమేం కాదు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని సాధిస్తే, 'ఆచార్య'  ఫలితం మాత్రం నిరాశ పరిచింది. అలా అని చెప్పేసి 'ఆచార్య'ను పూర్తిగా పక్కన పెట్టలేం. ఈ సినిమాలో చిరంజీవితో సమానంగా డాన్సులు .. ఫైట్లు చేసిన చరణ్ మంచి మార్కులనే కొట్టేశాడు. చరణ్ కి రావలసిన మార్కులను చరణ్ పట్టు కెళ్లడం ఖాయమని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చెప్పింది నిజమే అయింది.

 ఇక ఆ సినిమా ఫలితాన్ని గురించి పెద్దగా పట్టించుకోకుండా శంకర్ సినిమాతో చరణ్ బిజీ అయ్యాడు. ఈ కాంబినేషన్లో  సినిమా మొదలై చాలాకాలమే అయింది. అయితే చరణ్ ముందుగా 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లోను .. ఆ తరువాత 'ఆచార్య' ప్రమోషన్స్ లోను  బిజీగా ఉండటం వలన, శంకర్ సినిమాకి షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు చరణ్ ఫ్రీ కావడంతో ఈ సినిమా తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇంతకుముందు నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్స్ చరణ్ తదితరుల మధ్య యాక్షన్ సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో రన్నింగ్ ట్రైన్ పైన జరిగే ఫైట్ ప్రేక్షకులను విస్మయులను చేస్తుందని అంటున్నారు. ఈ ఫైట్ ను చిత్రీకరించడానికి హెలికాఫ్టర్ ను ఉపయోగించారు. ఇక తాజా షెడ్యూల్ ను వైజాగ్ లో చేస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ షూటింగు జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కియారా అద్వాని కూడా పాల్గొంది. చరణ్ కి సంబంధించిన కాలేజ్ నేపథ్యంలోని సీన్స్ .. ఆర్కే బీచ్ నేపథ్యంలో సీన్స్ .. చరణ్ తదితరులకు సంబంధించిన గొడవ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా చెబుతున్నారు.

ఈ సన్నివేశాలను శంకర్ తనదైన స్టైల్లో చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు. అలాగే పాటలను ఆయన ఫారిన్లో ప్లాన్ చేశాడని అంటున్నారు. పాటలకి కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు సమాచారం. 'వినయ విధేయరామా' సినిమా తరువాత చరణ్ కాంబినేషన్లో కియారా అద్వాని చేస్తున్న సినిమా ఇది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్ .. జయరామ్ .. నవీన్ చంద్ర .. అంజలి కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపైనే మెగా అభిమానుల దృష్టి ఉంది. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుపైకి చరణ్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News