ఇది 'హీరోయిన్ల గర్భం' కాలం.. వదంతులు.. వాస్తవాలు

Update: 2022-12-01 08:55 GMT
సినీ తారలంటే ఉండే ఆ క్రేజే వేరు.. వారు తినే తిండి.. తిరిగే కార్లు.. వాడే వస్తువులు.. ధరించే దుస్తులు.. నివసించే ఇళ్లు.. అభిమానులకే కాదు అందరికీ ఆసక్తే. రాత్రి పూట సినీ తారలు చేసుకునే పార్టీలంటే కొందరైతే చెవి కోసుకుంటారు. ఇక ఏ ఇద్దరి తారల నడుమ అయినా రిలేషన్ షిప్ ఉందని తెలిసిందో.. ఆ గుసగుసలకు అంతే ఉండదు. ఆ హీరోకు హీరోయిన్ కు సంబంధం ఉందట.. వారిద్దరూ విదేశాలకూ వెళ్లారట.. ఇలా ఎన్నో ఊహాగానాలు. వీటిలో వాస్తవాల సంగతి పక్కన పెడితే కొన్నిసార్లు ఖండనలు కూడా ఇవ్వాల్సి వచ్చేది. ఒకప్పుడు ఇలాంటి ఊహాగానాలు ఏ సినీ వార, పక్ష పత్రికలోనో వచ్చేవి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడాపెడా దంచేయడమే. ఈ ఊసంతా ఎందుకంటే.. ఇటీవల వరుసగా సినీ హీరోయిన్లకు సంబంధించి గర్భధారణకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో వాస్తవాలెంతో.. వదంతులేవో చూస్తే..

ఐశ్వర్య అలా ఎయిర్ పోర్టులో..

ఈ తరం అతిలోక సుందరి ఐశ్వర్యా రాయ్ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నటు్ల ఇటీవల కథనాలు వచ్చాయి. ముంబై ఎయిర్ పోర్టులో దిగిన ఈ మాజీ మిస్ వరల్డ్ వదులైన దుస్తులు ధరించి ఉండడాన్ని చూసి ఒకటే వార్తలు. పైగా ఆమె తాజాగా నటించిన పొన్నియన్ సెల్వన్ షూటింగ్ త్వరగా ముగించారంనే వదంతులూ వచ్చాయి. అయితే, ఐశ్వర్యకు సంబంధించిన ఈ వార్తలు వచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఆమె తరఫు నుంచి కానీ, బిగ్ బీ అమితాబ్ కుటుంబం నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ దంపతులకు సరిగ్గా 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఓ కూతురుంది.

వారి పెళ్లయింది.. అమ్మాయీ పుట్టింది

బాలీవుడ్ లో అత్యంత ఆకర్షణీయ జంట ఎవరంటే రణబీర్ కపూర్-ఆలియా భట్ అని చెప్పక తప్పదు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా, అప్పటికే ఆలియా గర్భిణి. తాజాగా వీరికి అమ్మాయి జన్మించింది. మరోవైపు ఆలియా ఈ ఏడాది బంపర్ హిట్ సినిమా ''ఆర్ఆర్ఆర్''తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో రామ్ చరణ్ మరదలిగా.. ఆయన కోసం వేచి చూసే ప్రేయసిగా చక్కటి నటన కనబర్చింది. మొత్తానికి రణబీర్ తో ఆలియా పెళ్లి ఈ ఏడాది మధ్య వరకు సస్పెన్స్ గా ఉండేది. ఏడాది చివరకు వచ్చేసరికి వారికి పెళ్లయి, ఓ అమ్మాయి పుట్టడం కూడా జరిగిపోయింది.

సోనమ్.. బిపాసా..

ఇప్పటి వారికి ఏమో కానీ.. ఓ రెండు దశాబ్దాల కిందట 'బిపాసా బసు' అంటే మామూలు క్రేజ్ కాదు. యువతను అంతగా ఊపేసింది ఆమె. ఫ్యాషన్ స్టార్ గానే కాదు.. సోగ కళ్లతో మత్తులో ముంచే అందం బిపాసాది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిపాసా చాలాకాలం జాన్ అబ్రహంతో ఎఫైర్ కొనసాగించింది. కొంత కాలానికి వారి బంధం చెడింది. చివరకు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా ఒక్కటయ్యారు. ఇటీవల బిపాసా సైతం గర్భంతో ఉన్న ఫొటోలు ఇన్ స్టాలో బయటకు వచ్చాయి. ఆ ఫొటోలో దంపతులిద్దరూ ఉన్నారు. ఇక వెటరన్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ తనదైన శైలిలో పదేళ్ల కిందట బాలీవుడ్ లో ముద్ర వేసింది. కెరీర్ కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఆనంద్ ఆహూజాను వివాహం చేసుకుని తెరకు దూరమైంది. సోనమ్ నిండు గర్భిణిగా ఉన్న చిత్రాలను దంపతులు ఇన్ స్టాలో షేర్ చేశారు.

నయన్ -విఘ్నేశ్

దక్షిణాది సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార ఎట్టకేలకు తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు. కెరీర్ తొలినాళ్లలో శింబు, ఆ తర్వాత ప్రభుదేవా వంటి స్టార్ లతో విఫల ప్రేమాయణం సాగించిన నయన్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. చివరకు విఘ్నేశ్ తో ఆమెకు ముడి కుదిరింది. కొన్నేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్న వీరు.. సరోగసి ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లితండ్రులయ్యారు.

కత్రినా కైఫ్.. మలైకా..

బాలీవుడ్ లో ఇప్పటికీ మాంచి డిమాండ్ ఉన్న నటి కత్రినా కైఫ్. ఆమె గర్భంతో ఉన్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. భర్త విక్కీ కౌశల్ తో కత్రినా ఉన్న ఫొటోను పట్టుకుని.. అందులో ఆమె బేబీ బంప్ తో కనిపించారంటూ ఊదరగొట్టారు. అయితే, దీనిపై వారి నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. ఇక బాలీవుడ్ లో నిత్యం వార్తలో నిలిచే జంట మలైకా అరోరా- అర్జున్ కపూర్. 49 ఏళ్ల మలైకా గర్భంతో ఉన్నారంటూ తాజాగా ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. దీన్ని అర్జున్ కపూర్ సీరియస్ గా తీసుకున్నారు. ''మీరు ఇలాంటివి సాధారణ వార్తలు అనుకుంటారు. కానీ, వాటి వల్ల మేం చాలా బాధపడతాం. మేం పట్టించుకోవడం లేదనే ఇలాంటివి రాస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అవి సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. జనం నమ్ముతున్నారు. ఇకపై ఇది మానండి. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు'' అంటూ మండిపడ్డారు. 38 ఏళ్ల అర్జున్-49 ఏళ్ల మలైకా కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆర్భాజ్ ఖాన్ కు విడాకులిచ్చిన మలైకా.. అర్జున్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ కథనాలు వచ్చినా అధికారికంగా ప్రకటితం కాలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News