డీజేకి ఇంత క‌లెక్ష‌న్లు ఎందుక‌య్యా అంటే

Update: 2017-06-26 10:21 GMT
డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ మూవీ విడుద‌లైంది. సినిమా వ‌ర‌కూ చూస్తే డివైడ్ టాక్ వ‌చ్చింది. బ‌న్నీ ఫ్యాన్స్ కాసింత నిరుత్సాహ‌ప‌డ్డారు. కానీ.. అనూహ్యంగా వ‌సూళ్ల‌తో దిమ్మ తిరిగిపోయే షాకిస్తోంది. నిజానికి సినిమాలో కొత్త విష‌యం ఏమీ లేదు. తెలిసిన క‌థే. ఎలాంటి మ‌లుపులూ లేవు. మ‌రి.. భారీ క‌లెక్ష‌న్లు ఎలా సాధ్య‌మ‌య్యాయి? అన్న‌ది ఇప్పుడు పెద్ద క్వ‌శ్చ‌న్ గా మారింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ట్యూబ్ లైట్ చిత్రానికి మించిన క‌లెక్ష‌న్లు మొద‌టిరోజు రావ‌టం ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది. ఇదెలా సాధ్య‌మ‌న్న ప్ర‌శ్న‌కు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం రావ‌టం లేదు.

డివైడ్ టాక్ వ‌చ్చిన డీజేకి భారీ క‌లెక్ష‌న్లు రావ‌టానికి ప‌రిస్థితులు క‌లిసి వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. బాహుబ‌లి-2 సినిమా త‌ర్వాత విడుద‌లైన పెద్ద హీరో సినిమా ఏదైనా ఉందంటే డీజేనే. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఒక మోస్త‌రు సినిమాల‌ను.. చిన్న హీరోల సినిమాల‌ను థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌టం మానేశారు. చిన్న సినిమాలు చూసే బ‌దులు.. వెబ్ సిరీస్‌ లు.. షార్ట్ ఫిలింలు బెట‌ర‌న్న మాట వినిపిస్తోంది.

ఒక‌వేళ చిన్న సినిమా బాగున్నా.. కాస్తంత ఓపిక ప‌డితే టీవీల్లో వ‌చ్చేసే ప‌రిస్థితి. చాలామంది ఇళ్ల‌ల్లో భారీ.. టీవీ తెర‌లు వ‌చ్చేసిన వేళ‌.. పైస‌లు ఖ‌ర్చు కాకుండా చిన్న సినిమాల్ని ఇంట్లోనే చూసేసే ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. చిన్న సినిమా కోసం థియేట‌ర్ల‌కు వెళ‌దామ‌ని అనుకున్నా.. ఖ‌ర్చు వాచిపోతుండ‌టంతో సెలెక్టివ్‌ గా సినిమాలు చూసే ధోర‌ణి ఎక్కువ అవుతోంది.

బాహుబ‌లి-2 త‌ర్వాత పెద్ద హీరోల సినిమాలు ఏమీ విడుద‌ల కాక‌పోవటంతో సినిమాలను అభిమానించే బ్యాచ్ ఒక‌టి పెద్ద సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇలాంటి వేళ‌లో డీజే సినిమా రిలీజ్ కావ‌టంతో.. అంద‌రి ఓటూ అటు ప‌డేలా చేసింది. పెద్ద సినిమా కోసం ముఖం వాచిపోయిన వారికి డీజే ఒక విందు భోజ‌నంగా మారింది.

మాంచి ఆక‌లితో ఉన్న‌ప్పుడు ఉప్పు..కారాలు కాస్త అటూఇటూగా ఉన్న న‌డిచిపోవ‌టం మామూలే. బాహుబ‌లి-2 త‌ర్వాత పెద్ద సినిమా ఏదీ లేక‌పోవ‌టం.. మొద‌టిది డీజే కావ‌టం ఆ సినిమాకు క‌లిసి వ‌చ్చింది. ఈ అంశం కూడా భారీ క‌లెక్ష‌న్లకు ఒక ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌న్న మాట వినిపిస్తోంది. ఇక‌.. డీజే టీజ‌ర్ సినిమా మీద ఆస‌క్తి పెంచేలా ఉండ‌టం.. డివైడ్ టాక్ వ‌చ్చినా.. ఒక‌సారి చూద్దాంలే అన్న భావ‌న కూడా సినిమాకు క‌లిసి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో డీజేకి పోటీగా ఏ సినిమా లేక‌పోవ‌టం ఇంకో సానుకూలాంశంగా విశ్లేష‌కులు చెబుతున్నారు.

హిందీ.. తెలుగు సినిమాల్ని చూసే వారి విష‌యానికి వ‌స్తే.. అంచ‌నాలు భారీగా ఉన్న ట్యూబ్ లైట్ తుస్సుమ‌న‌టంతో కాసింత డివైడ్ టాక్ ఉన్న డీజే ను ఒక చూపు చూస్తే ఏమ‌వుతాది? అన్న భావ‌న కూడా స‌ర్ ప్రైజ్ క‌లెక్ష‌న్ల‌కు కార‌ణంగా ట్రేడ్ అన‌లిస్టులు అభిప్రాయ ప‌డుతున్నారు. వ‌రుస‌గా వ‌చ్చిన సెల‌వులు కూడా డీజేకి లాభంగా మారింది. శ‌నివారం మొద‌లుకొని సోమ‌వారం వ‌ర‌కూ.. కొంద‌రికి మంగ‌ళ‌వారం వ‌ర‌కూ సెల‌వులు రావ‌టంతో.. ఇన్ని సెల‌వుల్లో ఒక్క‌రోజైనా సినిమాకు కేటాయించే తెలుగు వారికి డీజే మిన‌హా మ‌రో ఆప్ష‌న్ లేక‌పోవ‌టం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సుడి తిరిగిపోయేలా చేసింద‌న్న‌ది చిత్ర‌వ‌ర్గాల వాద‌న‌.
 
ఇదిలా ఉంటే.. మొద‌టి మూడు రోజుల్లోనే రూ.65 కోట్ల భారీ క‌లెక్ష‌న్ల‌ను డీజే రాబ‌ట్టిన‌ట్లుగా  సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా తాజాగా ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. క‌ర్ణుడి చావుకు స‌వాల‌చ్చ కార‌ణాల‌న్న సామెత‌ను కాస్త మారిస్తే.. డీజే క‌లెక్ష‌న్ల‌కు స‌వాల‌చ్చ రీజ‌న్లు  క‌లిసి వ‌చ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టైం క‌లిసి వ‌స్తే.. ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని ఊరికే అన‌లేదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News