బాహుబలి బడ్జెట్ ఎందుకు పెరిగిందంటే..

Update: 2017-04-30 09:49 GMT
‘బాహుబలి’కి మొదట అనుకున్న బడ్జెట్ రూ.150 కోట్లు. కానీ ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే సమయానికి అంకెల్లో మార్పులొచ్చాయి. ఈ సినిమాను రెండు భాగాలు చేయాలనుకోవడంతో బడ్జెట్ పెరిగిపోయింది. అది రూ.250 కోట్లకు చేరింది. బాహుబలి చిత్ర బృందం కూడా రెండు భాగాలకూ కలిపి రూ.250 కోట్లు ఖర్చు పెడుతున్నట్లే చెప్పింది. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్ టైంకు వచ్చేసరికి బడ్జెట్ ఏకంగా రూ.450 కోట్లకు పెంచి చెప్పాడు నిర్మాత శోభు. మరి 40 శాతం ముందే షూటింగ్ జరుపుకున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’లో మిగతా భాగానికి అంత ఖర్చు పెట్టేశారా అని సందేహం కలగడం ఖాయం. ఐతే వాస్తవానికి ఈ బడ్జెట్ పెరిగింది సినిమాకు అదనంగా ఖర్చు పెట్టడం వల్ల కాదు. బాహుబలి కోసం అపరిమితంగా కష్టపడ్డ యూనిట్ సభ్యులకు పారితోషకాలు భారీగా పెంచడం వల్ల అని సమాచారం.

‘బాహుబలి’ కోసం ముందుగా ప్రభాస్ కు ఇవ్వాలనుకున్న పారితోషకంగా రూ.25 కోట్లయితే.. చివరికి అతను అందుకుంటున్నది రూ.75 కోట్లని సమాచారం. ఇదంతా ‘బాహుబలి’ కోసం అతను నాలుగేళ్లకు పైగా పడ్డ శ్రమ.. చూపిన అంకితభావానికి దక్కిన బహుమతి. ‘బాహుబలి-1’ అసాధారణ విజయం సాధించడం.. భారీగా వసూళ్లు రాబట్టడం.. రెండో భాగానికి కళ్లు చెదిరే బిజినెస్ జరగడంతో బాహుబలి నిర్మాతలు యూనిట్ సభ్యులందరికీ ఆ ఫలాలు అందించాలని భావించారు. అందుకే దర్శకుడు రాజమౌళి.. అతడి కుటుంబ సభ్యులకు.. నటీనటులకు.. సాంకేతిక నిపుణులు.. ఇలా అందరికీ అదనపు పారితోషకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలా పెంచిన పారితోషకాల్ని కూడా బడ్జెట్లో కలపడంతో అది రూ.450 కోట్లకు చేరింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రతి పెద్ద సినిమాలోనూ పారితోషకాల వాటానే అధికం. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రూ.100 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్నాయంటే ఆ ఖర్చంతా సినిమాకు పెడుతున్నది కాదు. అందులో పారితోషకాలకే 60-70 శాతం పోతోంది. మిగతాది సినిమాకు ఖర్చు పెడుతున్నారు. ఈ లెక్కన చూస్తే ‘బాహుబలి’లో పారితోషకాల వాటా మరీ ఎక్కువేమీ కాదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News