అమితాబ్ ఉన్నా.. వర్మను నమ్మట్లేదు

Update: 2017-04-19 08:37 GMT
రామ్ గోపాల్ వర్మ గత దశాబ్ద కాలంలో తీసిన సినిమాలు చూసిన ఏ స్టార్ హీరో కూడా ఆయనతో పని చేయడానికి భయపడాల్సిందే. వర్మ నుంచి కళాఖండాలు చాలానే వచ్చాయి గత కొన్నేళ్లలో. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా బిగ్-బి అమితాబ్ బచ్చన్.. వర్మతో మళ్లీ పని చేయడానికి అంగీకరించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘సర్కార్-3’. ఈ చిత్రం మార్చి 17నే విడుదల కావాల్సింది. ఆ తేదీ నుంచి ఏప్రిల్ 7న వర్మ పుట్టిన రోజు నాటికి వాయిదా పడింది. కానీ ఏమైందో ఏమో.. ఆ తేదీకి కూడా సినిమాను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మే 12 అంటూ కొత్త డేట్ ఇస్తున్నారు.

మామూలుగా హిందీ సినిమాల్ని ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడం అరుదు. అక్కడ ఒక డేట్ పోతే ఇంకో డేట్ దొరకడం కష్టం. అయినా ‘సర్కార్-3’ని మళ్లీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నారు. సినిమాకు అనుకున్న ప్రకారం బిజినెస్ జరక్కపోవడం.. జనాల్లో కూడా ఈ సినిమాపై అంతగా ఆసక్తి కనిపించట్లేదు. అందుకే విడుదల విషయంలో ఈ కష్టాలు. సినిమాను సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేసినప్పటికీ.. మినిమం అని పెట్టుకున్న బిజినెస్ మార్కును కూడా ఈ సినిమా అందుకోలేకపోతోంది. ఈ సినిమాలో అమితాబ్ ఉన్నప్పటికీ.. వర్మ మీద జనాల్లో నమ్మకం పోవడమే ఈ సినిమాకు ఈ కష్టాలని అంటున్నారు. వర్మ ట్రాక్ రికార్డుకు తోడు.. ట్రైలర్ కూడా అంతగా ఆసక్తి రేకెత్తించకపోవడం ప్రతికూలమైంది. మరి కొత్త డెడ్ లైన్ ను అయినా ‘సర్కార్-3’ అందుకుంటుందా.. మరోసారి వాయిదా పడుతుందా.. చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News