రోబో స్టిల్స్ అలా బ‌య‌ట‌కు వ‌చ్చాయా?

Update: 2017-06-10 18:12 GMT
ఈ మ‌ధ్య‌న భారీ సినిమాల‌కు లీకు పీడ ప‌ట్టుకుంది. కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు పెట్టిన సినిమాకు లీకు వేసే దెబ్బ అంతా ఇంతా కాదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఏదో రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చే లీకుల‌తో సినిమాను దెబ్బ తీస్తుంద‌న్న భ‌యం ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో ఉంది. అందుకే.. క్రేజీ సినిమాల విష‌యంలో చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ లీకుల దారి లీకుల‌దే అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది.

త‌మిళ‌.. తెలుగు సినిమా వ‌ర్గాల్లో శంకర్ సినిమా వ‌స్తుందంటే దాని మీద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొద్ది కాలంగా ఆయ‌న ర‌జ‌నీ హీరోగా రోబో 2.0 మీద వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్.. అమీజాక్సన్ జంట‌గా న‌టిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ నెగిటివ్ రోల్ ప్లే చేయ‌టం ఈ సినిమా మీద స‌రికొత్త అంచ‌నాల్ని మ‌రింత పెంచింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన రెండు ఫోటోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. స‌హ‌జంగా శంక‌ర్ సినిమాలంటే.. సినిమాకు సంబంధించిన ఏ విష‌యం బ‌య‌ట‌కు రాదు. భారీ బ‌డ్జెట్‌ తో నిర్మిత‌మ‌య్యే ఆయ‌న సినిమా షూటింగ్ అంటే జాగ్ర‌త్త‌లు చాలానే ఉంటాయి. సెల్ ఫోన్ల మీద మొద‌లు చాలానే ఆంక్ష‌లు ఉంటాయి. మ‌రి.. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ రోబో2.0కి సంబంధించిన రెండు ఫోటోలు సోష‌ల్ మీడియాలో లీక్ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. రోబో 2.0 ప్ర‌మోష‌న్‌ ను త్వ‌ర‌లో మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి సంబంధించి స‌రికొత్త బ‌జ్‌ ను క్రియేట్ చేయ‌టానికి వీలుగా.. లీకు మార్గాన్ని ఎన్నుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు మొద‌లుపెట్టి చాలా కాలం కావ‌టం.. ర‌జ‌నీ తాజా మూవీ కాలా మీద జ‌నాల ఫోక‌స్ పెర‌గ‌టంతో.. రోబో 2.0 మీద దృష్టి మ‌రల్చ‌టానికి వీలుగా లీకు మీద ఆధార‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. గుట్టుగా లీకు చేస్తే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల‌తో ఒక్క‌సారి సినిమా వార్త‌ల్లోకి రావ‌టం.. లీకు మీద చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ మొద‌లు పెడితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లోనే తాజాగా రెండు ఫోటోల్ని లీకు చేశార‌న్న మాట త‌మిళ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా వినిపిస్తున్న మ‌రో మాటేమిటంటే.. ఇంత‌కాలం గుట్టుగా ఉన్న ఫోటోలు ఇప్పుడే ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాయి అని? లోగుట్టు పెరుమాళ్ల‌కే ఎరుక‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News