పారితోషికం పెరగాలంటే ఏం ఉండాలో చెప్పేసిన రెజీనా

Update: 2022-09-16 04:13 GMT
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హీరోయిన్లు చాలా చాలా తక్కువ. అందునా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు చెప్పే ప్రతి మాట వెనుక లెక్కలు ఉంటాయి. ఇక.. కొన్ని ప్రశ్నలకు ఏ హీరోయిన్ ను అడిగినా స్టాండర్డ్ గా ఉండటమే దీనికి నిదర్శనం. అయితే.. అందుకు కాస్త భిన్నంగా.. తన మనసులోని మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే కొద్ది మంది హీరోయిన్లలో రెజీనా ఒకరు. తాజాగా ఆమె నటించిన మూవీ శుక్రవారం విడుదల కానుంది.

ఈ సినిమా మీద బోలెడన్ని ఆశల్ని పెట్టుకుంది రెజీనా. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన పరిణామాల్ని చెప్పుకొచ్చారు.

ఇప్పుడైతే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. అప్పట్లో పెద్ద పేరు లేకపోవటం తెలిసిందే. అలాంటి రోజుల్లో తనకు ఎదురైన అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. రెజీనా మాటల్లోనే చదివితే..

'ఎస్ఎంఎస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పట్లో నా సినిమాలు.. డేట్స్ అన్నీ అమ్మే చూసుకునేది. అప్పట్లో చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. ఎందుకో తెలిసేది కాదు. అప్పట్లో పర్సనల్ మేకప్.. హెయిర్ ష్టైలిస్ట్ ఉండేవారు కాదు. ఒకసారి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ రోజు రేడియో చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్లా.

రేడియో ఇంటర్వ్యూనే కదా అని తలస్నానం చేసి.. జుట్టు సరిగా తుడుచుకోకుండా వెళ్లా. ఇంటర్వ్యూ తర్వాత ఫోటోలు తీసుకుంటామని అడిగితే ఓకే చెప్పా. ఆ తర్వాత వెబ్ సైట్స్ లోనూ.. గూగుల్ లోనూ ఇప్పటికి ఆ ఫోటోలు ఉన్నాయి. అందులో నేను అస్సలు హీరోయిన్ మాదిరే ఉండను'' అని నాటి సంగతుల్ని చెప్పుకొచ్చారు.

అప్పటి నుంచి ప్రమోషన్స్ అంటే చాలు.. జాగ్రత్తగా రెఢీ అయి వెళుతుంటా. అంతేకాదు ప్రమోషన్స్ ఏమైనా కానీ మేకప్ లేకుండా వెళ్లకూడదని అర్థమైందని చెప్పారు. అంతేకాదు.. 2011 నుంచి పర్సనల్ మేకప్ మ్యాన్.. హెయిర్ స్టైలిస్ట్ ను వెంట పెట్టుకొని వెళుతుంటానని.. వారు లేకుండా అస్సలు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏమైనా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే టాలెంట్ రెజీనా మాదిరి అందరిలో ఉండదని మాత్రం చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News