'ఆచార్య'లో ఐటమ్ సాంగ్ దుమ్మురేపిస్తుందన్న రెజీనా!

Update: 2022-01-03 10:30 GMT
టాలీవుడ్ పై అందాల సంతకం చేసిన కథానాయికలలో రెజీనా ఒకరు. కైపెక్కే కళ్లతో .. ఊరించే పెదవులతో ఉప్పెన వంటి సౌందర్యాన్ని ఆమె ప్రేక్షకులకు పరిచయం చేసింది. అందువల్లనే ప్రేక్షకులు తెరపై ఆమె కనిపిస్తే ఆ సినిమా అయిపోకూడదని కోరుకుంటారు .. ఆమె కలలో కనిపిస్తే తెల్లవారిపోకూడదని అనుకుంటారు. అంతలా ఆమె కుర్రాళ్ల గుండె గుడిలో కొలువుండిపోయి చూపుల నీరాజనాలు అందుకుంటోంది. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా వున్న పాత్రలను అందుకుంటూ ముందుకు వెళుతోంది. ఇటీవల 'ఆచార్య' సినిమా కోసం ఆమె మెగాస్టార్ సరసన హాట్ గా కనిపిస్తూ ఒక స్పెషల్ సాంగ్ చేసింది.

తాజాగా 'ఆహా' ఓటీటీలో 'చెఫ్ మంత్ర' కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి అడిగిన ప్రశ్నలకు రెజీనా తనదైన స్టైల్లో సమాధానం చెబుతూ వచ్చింది. "మీరు 'ఆచార్య' సినిమా కోసం ఒక సాంగ్ చేస్తున్నట్టుగా తెలిసింది .. అయిపోయిందా? అవుతుందా? ఒకవేళ అయిపోతే ఆ ఎక్స్ ప్రీరియన్స్ ఎలా ఉంది చెప్పండి?" అంటూ శ్రీముఖి అడిగింది. అందుకు రెజీనా స్పందిస్తూ .. "అయిపోయిందండీ .. ఆ సాంగ్ ను ఫోర్ నైట్స్ షూట్ చేశాము. అది ఒక సెలబ్రేషన్ సాంగ్ .. ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు. చిరంజీవిగారితో పాట అనేసరికి నేను ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఈ తరహా సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్.

ఇంతకుముందు చిరంజీవిగారిని బయట చాలా సార్లు చూశాను .. కానీ సెట్లో నేరుగా కలిసింది ఈ సినిమా షూటింగులోనే. ఆయన చాలా గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేస్తారు. యంగ్ జనరేషన్ ఆర్టిస్టులతో చేయడానికి ఆయన కూడా చాలా ఉత్సాహం చూపుతారు. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ .. ఈ సాంగ్ అందరికీ బాగా నచ్చుతుంది " అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో రెజీనా వరుస సినిమాలు చేస్తూ వెళ్లినప్పటికీ, 'పిల్లా నువ్వులేని జీవితం' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. 'జ్యో అచ్యుతానంద' వంటి సినిమాలు చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి. ఇక 'ఎవరు' సినిమా నటనకు స్కోప్ ఉన్న సినిమా కావడంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

రెజీనా కూడా ఇక నాయిక ప్రధానమైన కథలను ఎంచుకోవచ్చు అనే అభిప్రాయాలు వినిపించాయి. అదే సమయంలో కరోనా కారణంగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ సమయంలో ఆమె తమిళ సినిమాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ఆశ్చర్యం. తమిళంలో విశాల్ .. ఎస్ జె సూర్య .. సందీప్ కిషన్ .. అరుణ్ విజయ్ వంటి కథానాయకుల సరసన వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. ఇక తమిళంలో ఆమె చేస్తున్న 'శూర్పణగై' సినిమా తెలుగులో 'నేనే నా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' సినిమాలో ఆమె చేసిన ఐటమ్ ఏ స్థాయిలో యూత్ ను ఊపేస్తుందో .. మెగా అభిమానుల నుంచి ఆమె ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.




Tags:    

Similar News