రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాలిగా..!

Update: 2021-12-26 04:17 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి 7న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీమ్ దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళితో పాటుగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరియు ఇతర సాంకేతిక నిపుణులు నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం.. ఇంత సమయం కేటాయించి, తీవ్రంగా శ్రమించిన వీరందరికీ తగిన పారితోషికమే ముట్టినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ మల్టీస్టారర్ చేసినందుకు తారక్ మరియు చరణ్ ఒక్కొక్కరికి నిర్మాత రూ.45 కోట్ల వరకు చెల్లించారట. అలానే ఇందులో తక్కువ నిడివి గల పాత్ర పోషించినప్పటికీ.. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ కు రూ.25 కోట్లు ఇచ్చారట. రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలని ఆశపడిన ఆలియా భట్‌.. ట్రిపుల్ ఆర్ మూవీ కోసం రూ.9 కోట్ల వరకు తీసుకున్నారట.

స్టార్ డమ్ తో పాటుగా నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అజయ్ - అలియా లకు ఈ స్థాయి రెమ్యూనరేషన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తన భుజస్కంధాలపై మోసుకొస్తున్న రాజమౌళికి అండ్ ఫ్యామిలీకి RRR లాభాల్లో 30 శాతం వరకు వాటా అందనుందని ప్రచారం జరుగుతోంది.

ఒక సినిమా కోసం ఇన్నేళ్ళుగా కృషి చేస్తున్నారు కాబట్టే.. అలాంటి పారితోషికాలు ఇవ్వడంతో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ 2018 నుంచి మరో సినిమా చేయకుండా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మీదనే ఉన్నాడు. చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్ కు ప్రాధాన్యత ఇచ్చి గ్యాప్ లో 'ఆచార్య' చేశారు. ఇక రాజమౌళి సంగతి చెప్పక్కర్లేదు. నాలుగు సినిమాల కష్టం ఒక్క సినిమాకు పెట్టారు. కనుక వీరికి దానికి తగ్గ పారితోషికం ఇచ్చారని అనుకోవచ్చు.

రెమ్యూనరేషన్స్ సంగతి పక్కన పెడితే.. రాజమౌళి సినిమాకు వర్క్ చేసేవారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడైన రాజమౌళి.. తన సినిమాలో భాగం అయిన వారికి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' తో ఎన్టీఆర్ - రామ్ చరణ్ 'పాన్ ఇండియా స్టార్స్' గా వెలుగొందనున్నారు.

RRR ప్రమోషన్స్ తో ఇప్పటికే యావత్ సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి వచ్చిన బజ్ చూస్తుంటే.. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ - కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
Tags:    

Similar News