హిందీ బాక్సాఫీస్ పై మన హీరోల ఆధిపత్యం
అదే బాటలో అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.
బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. హిందీ బాక్సాఫీస్‌లో ప్రభాస్ సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో, అక్కడ అతడికి మంచి మార్కెట్ ఏర్పడింది. పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న అతడు, హిందీ ఆడియన్స్‌కి కూడా ఫేవరెట్ హీరో అయ్యాడు. అదే బాటలో అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్‌పై సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు అదే దారిలో ఎన్టీఆర్ వెళ్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ తనకు మంచి పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఆయన ఈ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ‘దేవర’ సినిమాతో ఎన్టీఆర్ ఈ మార్కెట్‌ని తిరిగి రిపీట్ చేశాడు.
ఈ సినిమా హిందీలో మొదటి వీకెండ్‌కి 25 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. ఇది హిందీ బాక్సాఫీస్ పై ఎన్టీఆర్ స్థాయిని చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో పలువురు హీరోలు ఈ స్థాయి కలెక్షన్స్ సాధించలేకపోయారు. ‘దేవర’ రాబోయే రోజుల్లో 50 కోట్ల మార్క్‌ని దాటుతుందని అంచనా.
ఇక మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కూడా తన తదుపరి చిత్రంతో హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా మహేష్ బాబుకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా, హిందీ బాక్సాఫీస్ పై కూడా దుమ్ము లేపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదే క్రమంలో ‘పుష్ప 2’ కూడా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిందీ మార్కెట్ పై దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు హీరోలు హిందీ బాక్సాఫీస్‌ను సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతున్నారని చెప్పొచ్చు. అలాగే అప్పుడప్పుడు నిఖిల్ లాంటి యువ హీరోలు కూడా హిందీ మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. అతను నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నెక్స్ట్ స్వయంభూ సినిమాతో మరో బిగ్ సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. ఇక తండేల్ ద్వారా నాగచైతన్య హిందీలో మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.