సూపర్ స్టార్ రజనీకి ఏమైంది? సోమవారం రాత్రి అపోలోలో చేరిక

సోమవారం రాత్రి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది

Update: 2024-10-01 04:13 GMT

సోమవారం రాత్రి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ న్యూస్ ఈ రోజు ఉదయం (మంగళవారం) బ్రేక్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఆయన బాగున్నట్లుగా తమిళ మీడియా చెబుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అటు అపోలో ఆసుపత్రి వర్గాలు కానీ.. ఇటు రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటనా లేదు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజనీకి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు. అయితే.. ఇది కూడా అధికారిక సమాచారం కాకపోవటం గమనార్హం.

గతంలో రజనీకాంత్ మెదడు రక్త నాళంలో బ్లాక్స్ ఏర్పడటంతో కావేరీ ఆసుపత్రిలో చేరటం.. తక్షణం స్పందించిన వైద్యులు ఆయనకు చికిత్స చేసి వాటిని అప్పట్లో తొలగించారు. ఆ ప్రక్రియ సక్సెస్ కావటంతో ఆయన త్వరగా కోలుకున్నారు. రజనీకాంత్ కు గతంలో కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన కిడ్నీలకు ఎలాంటి సమస్యలు లేవు. మొత్తంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు పలు వైద్య పరీక్షలు చేశారని చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. రజనీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళనతో ఉన్నారు. ఆసుపత్రి వర్గాలు కానీ.. కుటుంబ సభ్యుల నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడితే కొంత ఊరట చెందే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News