మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న `సైరా- నరసింహారెడ్డి` అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిసరాల్లో సాగుతోంది. మెగాస్టార్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే సైరా టీమ్ కి ఊహించని షాక్ ఇది.
సైరా సెట్స్ ని రెవెన్యూ అధికారులు కూలదోశారు. అనుమతి లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారని .. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పని ఇదని అధికారులు చెబుతున్నారు. అయితే నిర్మాతల తరపున వెర్షన్ వేరొకలా ఉంది. ఆ భూమిని యజమాని నుంచి లీజుకు తీసుకుని అందులో షూటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే ల్యాండ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` షూటింగ్ చేశారు. ఇప్పుడు అక్కడే ఎలాంటి అనుమతి తీసుకోకుండా సైరా చిత్రీకరణ సాగిస్తున్నారని అధికారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇది వివాదాస్పద భూమి.. ఇంకా కోర్టులో కేసు పెండింగులో ఉంది.. షూటింగ్ పేరుతో ఫిలింమేనేజ్ మెంట్ వాళ్లు ఆక్రమించాలని చూస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా ఇక్కడే చిత్రీకరణ సాగిస్తున్నారని రెవెన్యూ అధికారులు ఆరోపించడం సంచలనమైంది.