దూకుడు మీదే ఉన్న రీతూ వర్మ!

Update: 2021-10-27 23:30 GMT
రీతూ వర్మ .. చూడటానికి పెద్ద అందగత్తె కాదు గానీ, ఎక్కడో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. సింపుల్ గా కనిపిస్తూ .. సహజంగా నటిస్తూ ప్రేక్షకుల మనసులకు చేరువైపోతుంటుంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో జనం దృష్టిలో పడిన రీతూ, 'పెళ్లి చూపులు'తో పెద్ద హిట్ కొట్టేసింది. ఈ సినిమాతోనే ఆమె కెరియర్ ఊపందుకుంది. ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ తన స్వభావానికీ .. బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో 'కేశవ' నుంచి ఆశించిన ఫలితం రాకపోయినా ఆమె నిరాశ చెందలేదు.

కరోనా కారణంగా థియేటర్లు మూతబడటం .. ఆ తరువాత థియేటర్లు తెరిచినా జనాలు వస్తారో లేదోననే సందేహంలోనే, తెలుగు .. తమిళ భాషల్లో ఆమె చేసిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. తమిళంలో ఆమె చేసిన ఆంథాలజీ సినిమా 'పుతం పుధు కాలై' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆ తరువాత తెలుగులో నాని సరసన నాయికగా ఆమె చేసిన 'టక్ జగదీష్' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో  ద్వారానే విడుదలైంది. ఇక ఇప్పుడు మాత్రం ఆమె తాజా చిత్రమైన ' వరుడు కావలెను' థియేటర్లలో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నేను 'భూమి' అనే పాత్రలో కనిపిస్తాను. ప్రేమ - పెళ్లి అనే  విషయంలో పూర్తి క్లారిటీ కలిగిన ఒక బలమైన పాత్ర ఇది. 'పెళ్లి చూపులు' సినిమాలో పాత్రకి కాస్త దగ్గరగా కనిపించినా, కథా నేపథ్యాలు వేరు. నా పాత్ర నాకు మాత్రమే కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అందం .. ఆత్మవిశ్వాసం ఉన్న ఈ పాత్ర అమ్మాయిలందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

 ఇక వెబ్ సిరీస్ ల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి .. కానీ ఇంతవరకూ ఏ సబ్జెక్ట్ నచ్చలేదు. త్వరలో చేసే అవకాశాలైతే ఉన్నాయి. 'వరుడు కావలెను' తరువాత సినిమాగా 'ఒకే ఒక జీవితం' సినిమా లైన్లో ఉంది. శర్వానంద్ జోడీగా ఈ సినిమాలో కనిపించనున్నాను ..  ఈ పాత్ర  కూడా ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది " అని చెప్పుకొచ్చింది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమల ఒక కీలకమైన పాహ్రాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూర్చడం విశేషం.  హిట్టు - ఫ్లాపు, ఓటీటీ - థియేటర్ అనే విషయాలను పక్కన పెడితే, తన నుంచి వరుస సినిమాలు వచ్చేలా చూసుకుంటూ, రీతూ మాంఛి దూకుడు మీదే ఉంది. 
Tags:    

Similar News