​ఈ తెలుగు భామ కూడా తమిళంలో సెటిలా?

Update: 2017-06-26 08:37 GMT
తెలుగు భామలకు తెలుగులో అవకాశాలు దొరకడం కష్టమే. మన ఫిలిం మేకర్స్ కు ఎక్కువగా వేరే ఇండస్ట్రీల భామల మీదే కళ్లుంటాయి. ఐతే ఇక్కడ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన తెలుగు అమ్మాయిలు తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి మంచి మంచి ఛాన్సులు పట్టేయడం.. పెద్ద రేంజికి చేరుకోవడం చూశాం. అంజలి.. స్వాతి.. శ్రీ దివ్య.. ఆనంది (రక్షిత)లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకే చేరేలా కనిపిస్తోంది రీతూ వర్మ. చిన్న చిన్న క్యారెక్టర్లు.. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన రీతూకు ‘పెళ్లిచూపులు’ పెద్ద బ్రేక్ అవుతుందని అనుకున్నారంతా. కానీ ఆమెకు తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావట్లేదు.

‘పెళ్లిచూపులు’ విడుదలైన తర్వాత ఏడాదిలో రీతూ చేసిన ఏకైక సినిమా ‘కేశవ’ మాత్రమే. అందులోనూ ఆమె పాత్రకు ప్రాధాన్యం తక్కువే. ఐతే ఇదే సమయంలో తమిళంలో గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్.. విక్రమ్ లాంటి పెద్ద హీరోతో ‘ధృవ నక్షత్రం’ చేసే అవకాశం దక్కించుకుంది రీతూ. గౌతమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తూ గౌతమ్ ను మెప్పించడంతో కోలీవుడ్లో ఈమె గురించి ఫీడ్ బ్యాక్ బాగానే ఉన్నట్లుంది. తాజాగా ధనుష్ సినిమాలోనూ అవకాశం పట్టేసిందామె. ‘రఘువరన్ బీటెక్-2’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘వీఐపీ-2’లో రీతూ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ట్రైలర్లో రీతూ కనిపించింది. తెలుగు వెర్షన్ కు తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఈ సినిమా బాగా ఆడి.. ‘ధృవనక్షత్రం’ కూడా ఆమెకు మంచి పేరు తెస్తే కోలీవుడ్లో పెద్ద రేంజికి వెళ్లిపోయే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News