గ్రాఫిక్స్ కోసమే వంద కోట్లు పెట్టేస్తున్నారా?

Update: 2016-05-08 11:30 GMT
ఓ ఇండియన్ సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఐతే ఓ సౌత్ ఇండియన్ మూవీకి కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ.100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారంటే షాకవ్వాల్సిందే. ఆ సాహసమే చేస్తోంది లైకా ప్రొడక్షన్స్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 (2.0) గ్రాఫిక్స్ కోసం ఈ సంస్థ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నట్లు సమాచారం. రోబో తొలి భాగానికి గ్రాఫిక్సే ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ తో మన ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు శంకర్. ఆ సినిమాకు సీక్వెల్ అంటే.. వీఎఫ్ఎక్స్.. గ్రాఫిక్స్ విషయంలో మరింత భారీగా ఆశిస్తారు అభిమానులు. ఆ అంచనాల్ని అందుకునేందుకు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు శంకర్.

హాలీవుడ్కు చెందని ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో-2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు గ్రాఫిక్స్.. వీఎఫ్ఎక్స్ పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు శంకర్.

ఇందుకోసం దాదాపు 10 నెలల సమయం పడుతుందట. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ‘రోబో-2’ ఈ నెల ద్వితీయార్ధం నుంచి తర్వాతి షెడ్యూల్ కు వెళ్లబోతోంది. రజినీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News