'రాకెట్రీ' రియల్ హీరో .. నంబి నారాయణన్!

Update: 2022-07-03 09:40 GMT
మాధవన్ కథానాయకుడిగా మొన్న ప్రేక్షకుల ముందుకు 'రాకెట్రీ' .. ది నంబి ఎఫెక్ట్' వచ్చింది. ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రను పోషించిన మాధవన్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఎవరు ఈ నంబి నారాయణన్ అనే ఆలోచన రావడం సహజం. నంబి నారాయణన్ .. ఒక రాకెట్ సైంటిస్ట్. తమిళనాడులో 1941  డిసెంబర్ 12వ తేదీన ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కొబ్బరిపీచు వ్యాపారం చేసేవారు. మొదటి నుంచి కూడా నారాయణన్ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేవారు.

 ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఆయన కొంతకాలం పాటు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆ తరువాత  ఆయన అడుగులు లక్ష్యం దిశగా పడటం కనిపిస్తుంది. 'నాసా'లో అవకాశం వచ్చినప్పటికీ, దేశం పట్ల గల భక్తి కారణంగా ఆయన 'ఇస్రో'లో చేరారు. అక్కడ ఎంతోమంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. దేశీయ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ఆయన కీలకమైన పాత్రను పోషించారు. దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా, దేశద్రోహం నేరం క్రింద ఆయనను అరెస్ట్ చేశారు.

నారాయణన్ కి అసలు తనని ఎందుకు అరెస్టు చేశారనేది కొన్ని రోజుల వరకూ అర్థం కాలేదు. దీని వెనుక ఏదో బలమైన శక్తి ఉందనేది మాత్రం ఆయనకి అర్థమైంది. అందువలన పోలీసులు 50 రోజుల పాటు నరకం చూపించినా, జరిగినట్టుగా చెబుతున్న నేరంలో తన ప్రమేయం లేదనే విషయాన్ని ఆయన బలంగా చెప్పారు. కేసును సీబీఐకి అప్పగించారు .. 1995 జనవరి 19న నారాయణన్ కి బెయిల్ వచ్చింది. నారాయణన్ ఏ తప్పూ చేయలేదని సీబీఐ విచారణలో తేలింది. ఆయన నిర్దోషి అనే కోర్టు తీర్పు తరువాత తిరిగి 'ఇస్రో'లో చేరారు.

 ఇక అప్పటివరకూ తనని అనేక రకాలుగా వేధిస్తూ వచ్చిన కేరళ ప్రభుత్వంపై నారాయణన్  కేసు వేశారు. ఆ కేసులో ఆయన గెలిచి కేరప ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని పొందారు. ఆ తరువాత తాను అందిస్తూ వచ్చిన సేవలకు గాను 'పద్మభూషణ్' ను అందుకున్నారు. జరిగిన సంఘటన వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాన్ని ఆయన కేరళ  హై కోర్టు ఎదుట వ్యక్తం చేయడం తెలిసిందే. 
Tags:    

Similar News