ఐమాక్స్ ఫార్మెట్ లో జరిగే అద్భుతమే 'ఆర్ ఆర్ ఆర్'

Update: 2022-03-10 03:30 GMT
రాజమౌళి సినిమా అంటే ఒక ప్రయోగం .. ఒక అద్భుతం .. ఒక ఆశ్చర్యం అని ఆయన అభిమానులంతా అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. సినిమా సినిమాకి ఎదుగుతూ తనదైన ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడిగా ఆయన కనిపిస్తారు.

కథాకథనాలను ఆయన నడిపించే తీరు .. పాత్రలను డిజైన్ చేసే పద్ధతితో ఆయన ప్రేక్షకులను కట్టిపడేస్తూ వచ్చారు. 'యమదొంగ' సినిమా నుంచి ఆయన కథలకు గ్రాఫిక్స్ ను జోడించడం మొదలుపెట్టారు. ఆ తరువాత కథను .. గ్రాఫిక్స్ ను కలిపి ఆయన ఎలా నడిపించారనడానికి 'బాహుబలి' నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది.

ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రింట్ ను 'R మాస్టర్' గా చేసి .. ఐమాక్స్ ఫార్మెట్ లోకి మార్చారట.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్స్ లో ఈ ఫార్మెట్ ప్రింట్ నే ప్రేక్షకులు చూస్తారు. ఐమాక్స్ ఫార్మెట్ అనేది   ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఫీల్ ను ఇస్తుందని చెబుతున్నారు. భారీ సన్నివేశాలను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవుతారు. ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు.

ఇండియన్ సినిమాలలో ఐమాక్స్ ఫార్మెట్ లో ఇంతవరకూ మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఆ జాబితాలో 'ధూమ్ 3' .. 'బ్యాంగ్ బ్యాంగ్' .. 'బాహుబలి 2' కనిపిస్తాయి. 4వ సినిమాగా ఆ  జాబితాలో 'ఆర్ ఆర్ ఆర్' చేరిపోయింది.

ఇక తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే ఈ ఫార్మెట్ లో వచ్చిన మొదటి సినిమా 'బాహుబలి 2' అయితే, రెండవ సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. మొత్తానికి రాజమౌళి తెలుగు సినిమాను కథాకథనాల పరంగానే కాకుండా .. భారీతనం పరంగా టెక్నికల్ గా కూడా అత్యున్నతమైన స్థాయికి తీసుకుని వెళుతుండటం విశేషం.

చారిత్రక నేపథ్యానికి కాస్తంత కల్పనను జోడించి రాజమౌళి అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ను కొమరం భీమ్ గా చూడటానికీ .. చరణ్ ను అల్లూరి సీతారామరాజుగా చూడటానికి వాళ్ల ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్  -  హాలీవుడ్ నటీనటులు ఉన్నారు. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి వారు ఈ సినిమా స్థాయిని మరింత పెంచే పాత్రల్లో కనిపించనున్నారు. ఓపెనింగ్స్ నుంచే ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొట్టడం మొదలవుతుందని అంతా చెప్పుకుంటున్నారు.      
Tags:    

Similar News