రావడం పక్కా అని చెప్పినా..టైమ్ కి వచ్చే ఛాన్సే లేదు..!

Update: 2020-05-03 14:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్'ఆర్'ఆర్'. యావత్ భారతదేశ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదటగా ఈ సంవత్సరం జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ రాజమౌళి - చిత్ర నిర్మాతలు మీడియా ముఖంగా తెలుపగా.. అది కాస్తా దసరాకి షిప్ట్ అయింది. కానీ కొన్ని షూటింగ్ పనులు వాయిదా ఉండడంతో వచ్చే ఏడాది 2021 జనవరి 8కి వాయిదా వేయడం జరిగింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ ఇప్పుడల్లా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. మూవీ షూటింగ్స్ డిలే అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఖచ్చితంగా వాయిదా పడతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజమౌళి - డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తామని ప్రకటించినా ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఇప్పటికే నెలన్నర షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో తెలియదు. లాక్ డౌన్ ఎత్తేసినా ఎన్నో ఆంక్షలుంటాయి. ఇలాంటి భారీ చిత్రాన్ని తక్కువ మంది సిబ్బందితో షూట్ చేయడం అంత సులువు కాదు. ఇప్పుడు దొరికిన ఖాళీ సమయంలో కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినా సరే.. మిగతా చిత్రీకరణ.. తర్వాత నాలుగు భాషల్లో డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ - ఇతర వ్యవహారాల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం అంటే మాములు విషయం కాదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ను కూడా తన గత సినిమాకు దీటుగా మార్కెట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి. విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళిక అమలవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఏడాది చివరికి కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవు.

థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నప్పటికీ ఒకప్పటిలా జనాలు థియేటర్లకు రావడం అంత సులువు కాదు. అందుకే ఏ పెద్ద సినిమా కూడా విడుదల చేసే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులలో రిలీజ్ చేసి సినిమాకి వచ్చే రెవిన్యూ పోగొట్టుకోవాలి అనుకోరు. కాబట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 8న రావడం అసాధ్యమనే చెప్పవచ్చు. థియేటర్లు ప్రారంభమయ్యాక కొన్ని నెలలు వెయిట్ చేసి అటు ఇటుగా వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. 2017 ఏప్రిల్ 28 రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమా రిలీజ్ అయిన రోజు. ఈ సినిమా ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ సినిమా వాయిదా పడితే అదే బాహుబలి రిలీజ్ డేట్ కి వచ్చే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు సంభవిస్తాయో వెయిట్ అండ్ సీ..!


Tags:    

Similar News