బాహుబ‌లికి సాయిమాధ‌వ్ డైలాగ్స్ రాయ‌క‌పోవ‌డానికి కార‌ణం?

Update: 2021-07-13 04:23 GMT
క‌థ‌.. స్క్రీన్ ప్లే.. ద‌ర్శ‌క‌త్వం.. పాట‌లు .. యాక్ష‌న్ ఇవ‌న్నీ స‌రే కానీ.. డైలాగుల మాటేమిటి? ఆర్.ఆర్.ఆర్ కి డైలాగుల‌తో ఒరిగేదేమిటి? అంటే.. చాలా డీటెయిల్స్ లోకి వెళ్లాలి.  ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 చిత్రాల‌కు కొత్త కుర్రాళ్లు డైలాగులు రాసారు. విజ‌య్ కుమార్ - అజ‌య్ కుమార్ బాహుబ‌లి తెలుగు వెర్ష‌న్ కి డైలాగులు రాసారు. నిజానికి ఆ ఇద్ద‌రూ అప్ప‌టికి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ర‌చ‌యిత‌లు కారు. ఇక ఈ మూవీలో కిళికి బాష కోసం స్పెష‌లిస్ట్ ని బ‌రిలో దించ‌డం అది పెద్ద స‌క్సెస్ అవ్వ‌డం తెలిసిన‌దే.

కానీ ఈసారి ఆర్.ఆర్.ఆర్ కోసం రాజ‌మౌళి టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ డైలాగ్ రైట‌ర్ గా పాపుల‌రైన బుర్రా సాయి మాధ‌వ్ నే బ‌రిలో దించారు. బాహుబ‌లి చిత్రానికి కూడా అత‌డే డైలాగులు రాయాల్సింది. కానీ అప్ప‌ట్లో క్రియేటివి డిఫ‌రెన్సెస్ తో అత‌డు బాహుబ‌లికి ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌చార‌మైంది. బాహుబ‌లి ని ఒకే క‌థ‌గా తీయాల‌ని సాయిమాధ‌వ్ ప‌ట్టుబ‌ట్టార‌ని కానీ మేక‌ర్స్ రెండు భాగాలుగా తీసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో సాయి మాధ‌వ్ త‌ప్పుకున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది. ఈసారి మాత్రం డిఫ‌రెన్సెస్ కి ఆస్కారం లేకుండా ప్ర‌తిష్ఠాత్మ‌క‌ RRR చిత్రానికి డైలాగులు అందిస్తున్నారు సాయి మాధ‌వ్.

అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ బ‌హుభాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌వుతుంద‌ని టీమ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. సెకండ్ వేవ్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌యినా రిలీజ్ తేదీ మార్పుపై ఎవ‌రూ స్పందించిందేమీ లేదు. అంటే కాన్ఫిడెంట్ గా డెడ్ లైన్ ప్ర‌కారం ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేసేందుకు రాజ‌మౌళి స‌న్నాహ‌కాల్లో ఉన్నారనే భావించాల్సి ఉంటుంది.

ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్న సాయి మాధ‌వ్ మూవీ మేకింగ్ పై త‌న‌దైన లీకులు అందించారు. తాజా చాటింగ్ లో సాయి మాధ‌వ్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తన పనిని చాలా సులభం చేసేశార‌ని..  డైలాగ్స్ కోసం అంతగా కష్టపడాల్సిన అవసరం రాలేదని చెప్పాడు. చరణ్- ఎన్టీఆర్ ఇద్దరి పాత్రలను అత‌డు డిజైన్ చేసిన తీరుకు  సంభాష‌ణ‌ల‌తో అంత‌గా ప‌ని లేద‌ని కూడా సాయిమాధ‌వ్ అన్నారు.  స్క్రీన్ ప్లేని రాజ‌మౌళి అంత అద్భుతంగా రాశారని.. ఇద్ద‌రు హీరోల్లో ఎవరికి ఎక్కువ ఫుటేజ్ వచ్చిందనే దానిపై అభిమానులకు ఎలాంటి సమస్యలు ఉండవని కూడా సాయి మాధవ్ చెప్పారు. తార‌క్ చెప్పే దేశ‌భ‌క్తి సంభాష‌ణ‌లు మాత్రం ఉద్రిక్త‌త‌తో ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌చారంలో హంగామా కూడా మొద‌లైంది. ఈ నెల 15 న ఈ మూవీ మేకింగ్ వీడియోల‌ను రిలీజ్ చేయ‌నున్నామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. ఈ విజువ‌ల్స్ తో మ‌రోసారి గూగుల్ షేక్ అవ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ నుంచి ఇంకా చాలా వీడియోలు ఫోటో ట్రీట్ తో పాటు ప్ర‌చారం మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది.
Tags:    

Similar News