ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'ఆర్ ఆర్ ఆర్' రికార్డు!

Update: 2022-03-27 13:31 GMT
హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా చాలా చోట్లా చాలా మల్టీ ప్లెక్స్ లు వచ్చి ఉండొచ్చు. ఏ సినిమా అయినా ఒకే రోజున అన్ని థియేటర్స్ కి వచ్చేయవచ్చు. కానీ ఒకప్పుడు కొత్త సినిమాలు ఏవైనా ముందుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ కి వచ్చేవి. అప్పట్లో ఆ థియేటర్స్ పేరే రేడియోలోను మారు మ్రోగుతూ ఉండేవి. అలా సినిమాల పరంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇప్పుడు ఇన్ని థియేటర్స్ వచ్చినా ఆ ప్రాంతానికి గల చరిత్ర ఎంతమాత్రం తగ్గలేదు. అక్కడి ఓపెనింగ్స్ ను ప్రధానంగా తీసుకోవడమనేది ఇంకా జరుగుతూనే ఉంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇంతవరకూ విడుదలైన సినిమాలలో వసూళ్ల పరంగా టాప్ 10 సినిమాలేవనే విషయాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. అలా చూసుకుంటుంటే తాజాగా విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' ఫస్టు ప్లేస్ ను ఆక్రమించింది. తొలి రోజున ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ నుంచి  78 లక్షల గ్రాస్ ను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ నటించిన ఈ సినిమా సాధించిన రికార్డుల జాబితాలో ఇది కూడా ఒకటిగా కనిపిస్తోంది. 2వ స్థానంలో 'పుష్ప' ఉంటుందనే విషయాన్ని గెస్ చేయవచ్చు. ఇక్కడ ఈ సినిమా 41.31 లక్షల గ్రాస్ ను రాబట్టింది.

ఇక 3వ స్థానాన్ని 'భీమ్లా నాయక్' ఆక్రమించింది. ఈ సినిమా ఈ సెంటర్ నుంచి 38.06 లక్షలను వసూలు చేసింది.  మొదటి నుంచి కూడా 'భీమ్లా నాయక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందువలన మొదటరోజున ఇక్కడి నుంచి ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి ఈ సినిమా పెద్దగా కష్టపడలేదు. ఇక 37.28  లక్షల గ్రాస్ తో 'సరిలేరు నీకెవ్వరు' 4వ స్థానంలో .. 36 లక్షల గ్రాస్ తో 'బాహుబలి' 5వ స్థానంలో .. 35.08 లక్షల గ్రాస్ తో 'రాధేశ్యామ్' 6వ స్థానంలో ఉన్నాయి. 'రాధేశ్యామ్'పై ఉన్న హైప్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ తొలిరోజు వసూళ్లు తక్కువేనని అర్థమవుతుంది.

ఇక పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'  34.40 లక్షల గ్రాస్ తో 7వ స్థానంలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను దక్కించుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి. 34.29 లక్షల గ్రాస్ తో  8వ స్థానంలో 'సాహో' .. '29.98 లక్షల గ్రాస్ తో 9వ  స్థానంలో 'మహర్షి' కనిపిస్తుంది. 28.96 లక్షల గ్రాస్ తో 'అజ్ఞాతవాసి' 10వ స్థానంలో నిలిచింది. తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమాలు టాప్ టెన్ జాబితాలో నిలిచాయి. 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్' నుంచి ఈ రికార్డులను దక్కించుకున్న జాబితాలో ప్రభాస్ సినిమాలు 3, పవన్ సినిమాలు 3 ఉండగా, మహేశ్ సినిమాలు రెండు ఉండటం గమనించదగిన విషయం. 
Tags:    

Similar News