RRR సోల్ ఆంథెమ్ అప్డేట్: భావోద్వేగానికి గురి చేయనున్న 'జనని'..!

Update: 2021-11-22 13:46 GMT
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్. ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా మరో సాంగ్ అప్డేట్ ఇచ్చారు.

నవంబర్ 26న RRR సినిమా సోల్ ఆంథెమ్ పేరుతో 'జనని' అనే పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదొక ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది. 'జనని' సాంగ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో 'వందే మాతరం' అనే జెండా కనిపిస్తుండగా.. అజయ్ దేవగన్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ ఈ పాట ద్వారా భావోద్వేగానికి గురి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన 'జనని' పాట RRR సినిమాలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని తాజాగా విడుదలైన పోస్టర్ తెలియజేస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్స్ కు మంచి స్పందన లభించింది. 'దోస్తీ' 'నాటు నాటు' పాటలు శ్రోతలను విశేషంగా అలరించి ట్రెండ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా 'నాటు నాటు' పాటకు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ నాటు స్టెప్పులేస్తున్నారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాజమౌళి తండ్రి విజయజేంద్ర ప్రసాద్ రాసిన కల్పిత కథాంశంతో 'RRR' సినిమా రూపొందుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.
Tags:    

Similar News