జపాన్ లో సంచలనం సృష్టిస్తున్న RRR..!

Update: 2022-10-30 03:42 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఇటీవలే జపాన్‌ లో విడుదలైన సంగతి తెలిసిందే.

RRR చిత్రాన్ని జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా మూవీ ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా టోక్యో వెళ్లి సందడి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా భారీ కలెక్షన్స్ తో దూసుపోతోందని తెలుస్తోంది. తొలిరోజు రూ. 1.06 కోట్లు వసూలు చేసి జపాన్ లో అతిపెద్ద ఓపెనింగ్‌ రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది.

జపనీస్ ట్రేడ్ లెక్కల ప్రకారం, RRR చిత్రం మొదటి వారంలో JPY73M ని వసూలు చేసి.. ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ ఓపెనింగ్‌ ను సాధించింది. జపాన్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ లో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం 10 స్థానంలో ఉంది. అక్కడ 1 నుండి 9 స్థానాల్లో అన్ని జపనీస్ యానిమేషన్ చిత్రాలు ఉన్నాయని తెలుస్తోంది.

జపాన్ ప్రేక్షకులు భారతీయ సినిమాని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఎన్నో చిత్రాలు జపనీస్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తూ వస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రాలకు అక్కడ కూడా మంచి ఆదరణ దక్కింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'ముత్తు' ఇప్పటికీ జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు RRR సినిమా కూడా దాదాపు అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదలైన మొదటి 10 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు.

కాగా, అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో తారక్ - చరణ్ అద్భుతమైన నటన కనబర్చగా.. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ - శ్రేయా - సముద్రఖని తమ తమ పాత్రల్లో మెప్పించారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. 'నాటు నాటు' సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన ఈ మాగ్నమ్ ఓపస్.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో RRR మూవీ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News