ఇదెక్కడి పండుగ దోపిడీ బాస్.. డబ్బింగ్ సినిమాకు రూ.300?

Update: 2023-01-14 13:30 GMT
సంక్రాంతి పండుగ వచ్చేసింది. పెద్ద పండుగ కావటం.. వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ పర్వదినాల్లో మిగిలిన వినోదాల జాబితాలో సినిమా కచ్ఛితంగా ఉంటుంది. ఆ విషయంలో మరో మాటకు అవకాశమే లేదు. తెగింపుతో మొదలయ్యే సినిమా విడుదల సందది కల్యాణం కమనీయం మూవీతో ముగియనుంది. ఈ పండుగ సందర్భంగా తెలుగు సినిమాలే ఐదు విడుదల అవుతుంటే.. అందులో మూడు స్ట్రెయిట్ అయితే.. రెండు మాత్రం తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేసినవి రెండు.

స్ట్రెయిట్ సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్లు మల్టీఫ్లెక్సుల్లో  (ఈజీగా అర్థం అయ్యేందుకు హైదరాబాద్ ను పరిగణలోకి తీసుకుంటున్నాం) రూ.299, రిక్లెయినర్ అయితే రూ.350. పండుగ వేళ థియేటర్ కు వెళ్లి టికెట్లు  కొనే టైం ఉండదు కాబట్టి.. ఆన్ లైన్ లో కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ లెక్కన చూసినప్పుడు టికెట్ కు మరో రూ.30 నుంచి రూ.40 అదనంగా పడే అవకాశం ఉంది.

అంటే.. నలుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబం ఒక సినిమాకు వెళ్లటానికి టికెట్లకు అయ్యే ఖర్చు రూ.1400 అయితే.. ఇంటర్వెల్ లో పుడ్ బాదుడుకు కనీసం రూ.500 నుంచి రూ.వెయ్యి భారం ఖాయం. అంటే.. కేవలం థియేటర్ ఖర్చు రూ.2వేల వరకు ఉంటుంది. రెండు సినిమాల్ని కవర్ చేస్తే రూ.4వేలు అవుతుంది. ఒకవేళ పండుగ వేళ చుట్టాలు ఇంటికి వచ్చి.. వారి టికెట్ల బాధ్యత కూడా మీద పడితే ఆ లెక్కనే వేరు ఉంటుంది.

ఇప్పటికే భారీగా పెరిగిన టికెట్ల ధరలు భారంగా మారటం.. దీంతో చాలామంది థియేటర్లలో కంటే ఓటీటీలో చూసేందుకు మక్కువ చూపటం మొదలైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పలువురు నిర్మాతలు తమ సినిమా టికెట్ల ధరల్ని తక్కువగానే ఉంచినట్లుగా ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవటం ఆ మధ్యన చూశాం. తాజాగా మాత్రం పండుగ వేళ చచ్చినట్లుగాసినిమాలు చూస్తారన్న నమ్మకం.. పెద్ద హీరోల సినిమాలను పోటాపోటీగా వారి అభిమానులు చూస్తారని.. ఆ సందర్భంగా వారు టికెట్ ధరల్నిపట్టించుకోరన్న ఉద్దేశంతోనే రూ.299కు డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. సింగిల్ థియేటర్లలోనూ హై ప్రైస్ కే టికెట్ల ధరల్ని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

పెద్ద హీరోల సినిమాలు.. బడ్జెట్ ఎక్కువ కావటంతో స్ట్రెయిట్ సినిమాల టికెట్ ను రూ.299 డిసైడ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. తెగింపు.. వారసుడు లాంటి డబ్బింగ్ సినిమాల టికెట్ల ధరల్ని కూడా రూ.299కు డిసైడ్ చేయటం దేనికి నిదర్శనం. ఈ టికెట్ల బాదుడు విషయంలో నిర్మాతలు వ్యవహరించే ధోరణి వచ్చే సినిమాల మీద నెగిటివ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. సినిమాను వినోదం కంటే కూడా వ్యాపారంగా.. సినీ అభిమానుల అభిమానాన్ని పిండేయటం మంచి పరిణామం కాదంటున్నారు. బడ్జెట్ లు పెంచుకుంటూ పోవటం ఎందుకు? ఇంత భారీగా టికెట్ల ధరలు పెట్టి ఇబ్బంది పెట్టటం ఎందుకు? అన్న మాట వినిపిస్తోంది. నిర్మాతలకు వినిపిస్తుందా సగటు సినీ అభిమాని హాహాకారాలు..?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News