రెండు డిజాస్టర్స్ కు మహేశ్ ని బాధ్యున్ని చేస్తున్నారేంటి..?

Update: 2022-07-28 23:30 GMT
ఇటీవల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి కూడా జనాలు రాకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఎలాంటి సినిమా అయినా వారం రోజులు కూడా ఆడటం లేదు. ఈ మధ్య ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచిన చిత్రాలలో 'ఆచార్య' 'థాంక్యూ' ల గురించి చెప్పుకోవాలి.

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలను మిగిల్చాయి. దర్శకుడు ఇప్పటికీ దీని ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నాడంటే.. ఇది ఏ రేంజ్ ప్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ''థాంక్యూ'' సినిమా కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు. రిలీజైన తర్వాత చిత్ర బృందం ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదంటేనే రిజల్ట్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద 'ఆచార్య' 'థాంక్యూ' సినిమాలు ప్లాప్ అవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ని బాధ్యున్ని చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీనికి కారణం ఈ రెండు చిత్రాల్లో మహేశ్ రెఫరెన్సులు ఉండటమే. 'ఆచార్య' సినిమాకి సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. 'థాంక్యూ' లో మహేష్ రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించలేకపోయాయి.

ఇదే విషయాన్ని ఇప్పుడు యాంటీ మహేష్ ఫ్యాన్స్ మరియు ఓ వర్గం మెగా అభిమానులు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు. మహేశ్ భాగస్వామ్యం ఉండటం వల్లనే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయని ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి ఒక సూపర్ స్టార్ మరొక స్టార్ హీరో సినిమాకి వాయిస్ ఇవ్వడం లేదా ఇతర చిత్రాల్లో అతిధి పాత్రలో నటించడం వంటివి చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే అభద్రతా భావం - ఈగోలు ఉన్న ఇండస్ట్రీలో మహేష్ బాబు మాత్రం అలాంటి వాటికి ముందే ఉంటాడు. సినిమా బాగుంటే తనకు పోటీదారు హీరోలను అభినందించడానికి అతను వెనుకాడడు.

గతంలో పవన్ కళ్యాణ్ 'జల్సా' మరియు ఎన్టీఆర్ 'బాద్ షా' వంటి సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి. అలానే అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో మహేశ్ రెఫరెన్స్ లు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 'ఆచార్య' 'థాంక్యూ' ప్లాప్ అవ్వడానికి మహేష్ కారణం అని ట్రోల్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలడు.

చిరంజీవి - రామ్ చరణ్ ల మీద అభిమానంతో మహేష్ 'ఆచార్య' సినిమాకు తన గాత్రాన్ని అందించడానికి అంగీకరించి, తనవంతు సహాయం చేశాడు. అందుకుగాను రిజల్ట్ ని పట్టించుకోకుండా మహేష్ కు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఇలా సోషల్ మీడియాలో విమర్శించడం కరెక్ట్ కాదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News