'రాధేశ్యామ్' రన్ టైమ్ ఎంతో తెలుసా?

Update: 2022-02-05 09:30 GMT
ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా కూడా 'రాధే శ్యామ్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ పోతుండటంతో, థియేటర్లు మూతబడే సూచనలు కనిపిస్తూ ఉండటంతో వాయిదా వేశారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను మార్చి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. ఉత్తరాది ప్రేక్షకుల .. దక్షిణాది ప్రేక్షకుల అభిరుచి వేరుగా ఉంటుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించిన పాటలను .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను వేరు .. వేరు సంగీత దర్శకులతో చేయిస్తూ వచ్చారు. అలాగే రన్ టైమ్ విషయంలోను ఈ తేడా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. హిందీ వెర్షన్ కి సంబంధించిన రన్ టైమ్ 2:30 గంటలు ఉంటుందట. ఈ రన్ టైమ్ ను లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించిన రన్ టైమ్ లో ఏదైనా తేడా ఉంటుందేమో చూడాలి. బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం .. అద్భుతమైన ఆవిష్కరణ ఉంటే రన్ టైమ్ ఎంతనేది ప్రేక్షకులు ఎంతమాత్రం పట్టించుకోరు. ఈ సినిమాలో భవిష్యత్తును ముందుగానే చెప్పగలిగే హస్తసాముద్రికుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. తన ప్రేమ విషయంలో .. తన మనసు దోచిన అమ్మాయి కోసం విధికి ఎదురెళ్లే ప్రయత్నం చేసే యువకుడి పాత్రను ఆయన పోషించాడు. ఈ పాత్రలో ఆయనను చూడటానికి అభిమానులంతా ఆసక్తితో .. ఉత్సాహంతో ఉన్నారు.

'బాహుబలి' సినిమాలో పోరాట యోధుడిగా కనిపించిన ప్రభాస్, 'సాహో'లో దొంగగా కనిపించాడు. ఈ రెండు సినిమాల్లోను యాక్షన్ పాళ్లు ఎక్కువ. ఆ సినిమాలకు పూర్తి భిన్నమైన నేపథ్యంలో ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. ఆయన లుక్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉంది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో కృష్ణంరాజు .. సత్యరాజ్ .. జగపతిబాబు .. భాగ్యశ్రీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించినట్టుగా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News