అప్పట్లో దర్శకుడు రవిబాబుకు ఫోన్ చేస్తే..

Update: 2017-01-08 01:30 GMT
ఇంతకుముందు దర్శకుడు కావాలంటే చాలా తతంగం ఉండేది. ఓ మోస్తరు పేరున్న దర్శకుడి దగ్గర అసిస్టెంటుగా చేరాలన్నా చాలా రికమండేషన్లు అవసరమయ్యేువి. ఆ రెకమండేషన్లతో అసిస్టెంటుగా చేరినా.. ఏళ్లకు ఏళ్లు పని చేస్తే తప్ప సినిమా తీయడానికి అవసరమైనంత అనుభవం వచ్చేది కాదు. దర్శకుడిగా అవకాశాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. సహాయ దర్శకుడిగా అనుభవం లేకపోయినా.. ఫిల్మ్ కోర్సులేవో చేసి.. షార్ట్ ఫిలిమ్స్ చేసి.. తమ ప్రతిభను చాటుకోవడం ద్వారా దర్శక నిర్మాతల దృష్టిలో పడుతున్నారు. పేరున్న దర్శకుల దగ్గర పని చేసే అవకాశాలు అందుకుంటున్నారు. సినిమాలు తీసే ఛాన్సులూ పట్టేస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన సాగర్.కె.చంద్ర కూడా ఈ కోవకే చెందుతాడు. 20 ఏళ్ల వరకు అసలు సినిమాల ఆలోచనే లేని తాను ఎలా చాలా త్వరగా దర్శకుడిగా మారింది అతను ఓ ఇంటర్వ్యలో వివరించాడు.

‘‘మాది నల్గొండ టౌన్. సినిమా వాసనలేమీ ఉండేవి కావక్కడ. అందుకే 20 ఏళ్ల వరకు సినిమాల గురించే ఆలోచించలేదు. అమెరికాలో ఎమ్మెస్ చేశాను. దాంతో పాటే సరదాగా సినిమా కోర్సు చేశాను. వెంటనే ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ అప్పుడు మనసు మాత్రం సినిమాలపైకి మళ్లింది. రెండు లక్షల జీతం తీసుకుంటున్నా సంతృప్తి లేదు. సినిమాల్లోకి వెళ్తానని అమ్మానాన్నలకు చెబితే భయపడిపోయారు. కానీ మా అక్క మాత్రం నన్ను ప్రోత్సహించింది. దీంతో 2009లో ఇండియాకు తిరిగొచ్చేశా. పరిశ్రమలో నాకు సినిమా కష్టాలేమీ ఎదురు కాలేదు. డైరెక్టర్‌ రవిబాబుగారికి నేరుగా ఫోన్‌ చేసి ఇలా అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చానని.. అవకాశం ఇవ్వమని అడిగాను. ఆయన అడ్డు చెప్పకుండా ‘అమరావతి’కి అసిస్టెంటుగా చేర్చుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు సుధాకర్‌ బాబు అనే నిర్మాతకు ‘అయ్యారే’ కథ చెప్పి మెప్పించా. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పైగా ఓ అనవసర వివాదంలో చిక్కుకుంది. తర్వాత రెండు సినిమాలు మొదలైనట్లే మొదలై ఆగిపోయాయి. కొంతకాలం యాడ్స్ చేస్తూ నడిపించాను. శ్రీవిష్ణు నాకు ఫ్రెండ్‌. విష్ణుకి నారా రోహిత్‌ ఫ్రెండు. ఆయనకు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ చెబితే అప్పటికే వేరే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నానని.. కొంత కాలం ఆగమని చెప్పాడు. దీంతో నేను వేరే ప్రయత్నాలు మొదలెట్టా. కొన్నాళ్లకు ఆయనే పిలిచి ఈ సినిమా చేద్దామన్నారు. గొప్పవాడు కావాల్సినవాడు పరిస్థితుల కారణంగా ఎలా మామూలుగా మిగిలిపోయాడు అనే లైన్ తో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ రాసుకున్నా. 90ల నాటి పరిస్థితులకు సంబందించి నేను చూసినవి.. విన్నవి.. చదివినవి స్క్రిప్టులో చేర్చా. అందరం మనసు పెట్టి పని చేశాం. మంచి ఫలితం వచ్చింది’’ అని సాగర్ చెప్పాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News