ప్రచారం చేయాలనుకున్నా మామయ్య వద్దన్నారు

Update: 2019-04-09 10:27 GMT
ఏపీ ఎన్నికల్లో పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతుగా మెగా హీరోలు పలువురు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. వరుణ్‌ తేజ్‌ స్వయంగా రంగంలోకి దిగి తండ్రి నాగబాబు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. రామ్‌ చరణ్‌ కూడా ఇటీవలే బాబాయి పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి మద్దతు తెలిపాడు. ఈ సమయంలోనే సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం జనసేనకు మద్దతుగా ప్రచారం ఎందుకు చేయడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్‌ లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెగా మేనల్లుడు క్లారిటీ ఇచ్చాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన 'చిత్రలహరి' సినిమా విడుదల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. తిరుపతిలో ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ జనసేన తరపున ప్రచారం చేయాలని తాను ఆశించాను, భావించాను. కాని మామయ్య అందుకు ఒప్పుకోలేదు. నేను ప్రచారం చేస్తానంటే ఆయన అనుమతి ఇవ్వలేదు. సినిమాలు, రాజకీయాలు రెండు చేయడం కరెక్ట్‌ కాదు, అటో కాలు ఇటో కాలు వేయడం ఏమాత్రం సమంజసం కాదు అన్నారు. ఆయన మాట మీరి నేను ఏం చేయలేను. అందుకే జనసేన కోసం ప్రచారం చేయలేక పోతున్నట్లుగా తేజ్‌ చెప్పుకొచ్చాడు.

వరుసగా ఆరు ఫ్లాప్‌ ల తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన సినిమా ఇది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించడంతో పాటు మైత్రి మూవీస్‌ బ్యానర్‌ లో ఆ చిత్రం రూపొందిన కారణంగా చిత్రలహరి చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రలహరి చిత్రం ప్రమోషన్‌ లో తేజ్‌ చాలా బిజీగా ఉన్నాడు. మామయ్య జనసేన ప్రచారం చేయవద్దని చెప్పినా తేజ్‌ మాత్రం సోషల్‌ మీడియా ద్వారా గ్లాస్‌ గుర్తుకు ఓటు వేయమని తనవంతు ప్రచారం చేస్తూనే ఉన్నాడు.
   
   
   

Tags:    

Similar News