జైనబ్ ఎవరు? అఖిల్ కి కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

అక్కినేని వారి ఇంట మరో వారం రోజుల్లో పెళ్ళి బాజాలు మోగనున్న తరుణంలో, ఇంటి పెద్ద కింగ్ నాగార్జున మరో శుభవార్తను అందరితో పంచుకున్నారు.

Update: 2024-11-27 03:48 GMT

అక్కినేని వారి ఇంట మరో వారం రోజుల్లో పెళ్ళి బాజాలు మోగనున్న తరుణంలో, ఇంటి పెద్ద కింగ్ నాగార్జున మరో శుభవార్తను అందరితో పంచుకున్నారు. తన చిన్న కుమారుడు అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. జైనబ్‌ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగినట్టు తెలుపుతూ, ఫొటోలను షేర్ చేశారు. డిసెంబరు 4న నాగచైతన్య - శోభిత ధూళిపాళ పెళ్ళి జరగనుండగా.. ఇప్పుడు సడన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం షాకింగ్ గా అనిపించింది. ఈ నేపథ్యంలో అఖిల్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటి?, జైనబ్ రావ్డ్జీ ఎవరు? అని తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

జైనబ్ రావ్డ్జీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్డ్జీ కుమార్తె అని తెలుస్తోంది. జైనబ్ సోదరుడు జైన్ రావ్డ్జీ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జైనబ్‌ ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. ఇండియాలోనే కాదు దుబాయ్, లండన్‌లోనూ ఆర్టిస్ట్‌గా రాణించింది. హైదరాబాద్‌లో జరిగిన రిఫ్లెక్షన్స్ తో సహా అనేక ఎగ్జిబిషన్స్ లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ను ప్రదర్శించారట. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉన్నప్పటికీ, జైనబ్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అని తెలుస్తోంది.

ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓడియన్ థియేటర్ అధినేతే జైనబ్ తండ్రి జుల్ఫీ రావ్డ్జీ అని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు పేరు మోసిన ఆ థియేటర్ ను ఇటీవల కాలంలో మల్టీ ఫ్లెక్స్ గా మార్చారు. జుల్ఫీకి చాలా పెద్ద సర్కిలే ఉందని అంటున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలతో చాలా సాన్నిహిత్యం వుందట. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన సలహాదారుగా కూడా పనిచేశారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తరఫున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి జుల్ఫీ ప్రాతినిధ్యం వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఇక జుల్ఫీ రావ్‌డ్జీ, అక్కినేని నాగార్జున మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహబంధం ఉందట. అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో జైనబ్ రావ్‌డ్జీతో పరిచయం ఏర్పడిందట. అది కాస్తా ప్రేమగా మారిందట. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. ఇరు కుటుంబాలు అంగీకారంతో ఒక్కటికాబోతున్నారు. కొద్దిమంది సన్నిహితులు, బంధు మిత్రుల సమక్షంలో అఖిల్ - జైనబ్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీ వయస్సుల గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జైనబ్ ఏజ్ 39 ఏళ్లు అని, అఖిల్ కంటే తొమ్మిదేళ్లు పెద్దది అని అంటున్నారు. దీంట్లో ఏమాత్రం నిజం లేదని.. ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే అని మరికొందరు అంటున్నారు. వీటిల్లో ఏది నిజమనేది పక్కన పెడితే.. ప్రస్తుతం అఖిల్ వయస్సు 30 ఏళ్లు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లికి ఇది సరైన వయస్సు అని చెప్పాలి.

ఏదేమైనా అక్కినేని అభిమానులంతా అఖిల్‌ కొత్త సినిమా కబురు కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో, ఎంగేజ్మెంట్ ప్రకటనతో వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఓవైపు తన అన్నయ్య నాగచైతన్య పెళ్లి పనులు జరుగుతుంటే, ఎవ్వరూ ఊహించని విధంగా మరోవైపు తమ్ముడు అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ మాత్రం అక్కినేని ఇంట రెండు శుభకార్యాలు జరుగుతుండటంతో చాలా హ్యపీగా ఉన్నారు. మరి త్వరలోనే నాగార్జున తన చిన్న కొడుకు పెళ్లి డేట్ ను కూడా ప్రకటిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News