సుప్రీమ్.. ది బెస్ట్ అయిపోయింది

Update: 2016-05-23 09:50 GMT
ఏముంది మామూలు సినిమానే కదా అన్నారు.. సెకండాఫ్ తేలిపోయిందన్నారు.. ఇంత పోటీలో కష్టమే అని తీర్మానించారు. తీరా చూస్తే ‘సుప్రీమ్’ ఏకంగా రూ.20 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయి కూర్చుంది. సాయిధరమ్ కెరీర్లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలున్నాయి. కానీ అవి నిఖార్సయిన హిట్లు అని చెప్పుకోలేని పరిస్థితి. వాటి రెవెన్యూను బట్టి ‘ఎబోవ్ యావరేజ్’ అని చెప్పాలి. ఐతే సుప్రీమ్ మాత్రం నిర్మాతకు.. బయ్యర్లకు.. అందరికీ సంతోషాన్ని మిగిల్చిన సినిమా అయింది. నిర్మాత దిల్ రాజు మంచి లాభాలకే సినిమాను అమ్మాడు.

ఐతే బయ్యర్లకు లాభాలు రావాలంటే రూ.20 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి. మొదట్లో ఈ సినిమాకు వచ్చిన టాక్.. రెండో రోజు ‘24’ విడుదలయ్యాక కలెక్షన్లు డ్రాప్ అవడం చూసి.. ‘సుప్రీమ్’ ఫుల్ రన్లో రూ.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా గొప్పే అనిపించింది. కానీ తర్వాతి వీకెండ్లో పోటీ లేకపోవడం.. తాజాగా ‘బ్రహ్మోత్సవం’కు డివైడ్ టాక్ రావడం.. ‘సుప్రీమ్’కు కలిసొచ్చింది. మూడో వీకెండ్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ.20 కోట్ల షేర్ మార్కును దాటేసింది. మొత్తానికి ‘సుప్రీమ్’ అందరికీ సంతోషాన్ని మిగిల్చిన సినిమా అయింది. ‘పటాస్’తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. వరుసగా రెండో హిట్టుతో కమర్షియల్ సినిమాల మీద తన పట్టును మరోసారి రుజువు చేసుకున్నాడు.
Tags:    

Similar News