మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్‌ని `విన్నర్`ని చేశాడు గోపీచంద్ మలినేని. ఆ సినిమాకీ... `బాహుబలి`కీ మధ్య ఓ లింకు కుదిరింది. అసలు రాజమౌళి `బాహుబలి` ఎక్కడా? సాయిధరమ్ తేజ్ `విన్నర్` ఎక్కడ? ఆ సినిమాతో లింకు కుదరడమేంటి అంటారా? కానీ అది నిజం. ఆ వివరాల్లోకి వెళితే... టర్కీలోని ఇస్తాంబుల్‌లో `విన్నర్` క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్ని బల్గేరియన్ ఫైట్ మాస్టర్ కలయాన్ ఆధ్వర్యంలో షూట్ చేశారు. `బాహుబలి`లో మంచు కొండల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించింది కలయానే. ఆ రకంగా విన్నర్‌కీ, బాహుబలికీ లింకు కుదిరిందన్నమాట. ఆ విషయాన్ని ప్రధానంగా చెబుతూ ప్రచారం చేసుకొంటోంది విన్నర్ చిత్ర బృందం. అయితే గ్రాండియర్ విషయంలో `విన్నర్` టీమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. విదేశాల్లో ఒక పెద్ద పార్ట్‌నే షూట్ చేశారు. టర్కీలో అరుదైన లొకేషన్లని వెదికి పట్టుకొని మరీ అక్కడ కొన్ని పాటల్ని, యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. అనసూయతో ఐటెమ్ పాటని కూడా విదేశాల్లోనూ షూట్ చేయడం విశేషం. ఇక ఊటీ, బెంగుళూరుల్లో తదుపరి షెడ్యూల్‌ని జరిపి షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంది చిత్రబందం. అన్నట్టు రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ రోజే విడుదల చేసిన స్టిల్స్‌లో తేజూ, రకుల్ జోడీ చూడముచ్చటగా కనిపిస్తోంది.