సంతోషం.. మనోళ్లకు మంచి పాత్రలిస్తున్నారు

Update: 2015-08-19 01:38 GMT
పొరుగింటి పుల్లకూర రుచి అని ఓ సామెత. తెలుగువాళ్ల విషయంలో ఈ సామెత భలే కరెక్టుగా సూటవుతుంది. మన టాలెంట్ ను మనం గుర్తించం. వేరే వాళ్ల టాలెంటుని పొగుడుతాం. వాళ్లకు పెద్ద పీట వేస్తాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ పోకడ బాగా కనిపిస్తుంది. తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు. కానీ ముఖ్యమైన పాత్రలకు వాళ్లు పనికిరారు. కీలకమైన పాత్ర ఏదైనా ఉందంటే వెంటనే ముంబయి మీదో.. చెన్నై మీదో మన దర్శకుల కళ్లు పడతాయి. ఐతే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. మనోళ్లకూ మంచి పాత్రలు దక్కుతున్నాయి. ఎప్పుడూ ప్రకాష్ రాజ్ కో, ఇంకొకరికో ఇచ్చే కీలకమైన పాత్రలకు మన నటుల్ని కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ల టాలెంట్ ఏంటో చూపించే అవకాశమిస్తున్నారు.

‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారమెత్తిన జగపతి బాబు.. ఇప్పుడు కీలకమైన పాత్రలతో చెలరేగిపోతున్నాడు. కరెంటు తీగ, పిల్లా నువ్వు లేని జీవితం, శ్రీమంతుడు.. ఇలా ఆయన ముఖ్య పాత్ర పోషించిన ప్రతి సినిమా హిట్టవుతోంది. తాను పోషించే ప్రతి పాత్రకూ ఆయన వన్నె తెస్తున్నారు. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ మధ్య కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో ఆయన పాత్రలు బాగా పేలాయి. తాజాగా ‘శ్రీమంతుడు’ కూడా రాజేంద్ర ప్రసాద్ అంటే ఏంటో చూపించింది. ఇన్నాళ్లూ రాజేంద్రుడిని మనం ఎందుకు మిస్సయ్యాం అనిపించేలా ఆయన సత్తా చాటుతున్నారు. మరోవైపు సాయికుమార్ కూడా నెమ్మదిగా తన రేంజి పెంచుకుంటున్నాడు. ఎవడు సినిమా తర్వాత పండగ చేస్కోలో ఆయన పాత్ర బాగా పండింది. ఈ ముగ్గురి చేతిలోనూ ఇప్పుడు మంచి మంచి అవకాశాలున్నాయి. మొత్తానికి మనోళ్ల టాలెంటుని గుర్తించి దర్శకులకు వాళ్లకు మంచి రోల్స్ ఇస్తుండటం.. ఆ పాత్రల్లో వాళ్లు తమ ప్రత్యేకత చూపిస్తుండటం తెలుగు ప్రేక్షకులకు సంతోషాన్నిచ్చే విషయమే.
Tags:    

Similar News