బిగ్ ఫైట్‌: శౌర్య‌ వ‌ర్సెస్ శైల‌జ‌

Update: 2018-08-18 04:44 GMT
వారం వారం రెండు మూడు సినిమాలు ఒకదానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. వీటిలో ఏ సినిమాలో ద‌మ్ముంటే ఆ సినిమాకి ప్రేక్ష‌క‌జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రీసెంట్ సినిమాల్లో గూఢ‌చారి - గీత‌గోవిందం బ్లాక్‌ బ‌స్ట‌ర్లుగా నిలిస్తే - శ్రీ‌నివాస క‌ళ్యాణం డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఇలా ప్ర‌తి వారం సినిమాలొస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. వీటిలో విజ‌యాల‌తో నిర్మాత‌లు - పంపిణీదారుల‌కు ఆనందాన్ని మిగిల్చేవి కొన్ని మాత్ర‌మే మిగులుతున్నాయి. ప్ర‌తియేటా టాలీవుడ్ లో 150-200 సినిమాలు రిలీజ‌వుతుంటే .. 5శాతం మాత్ర‌మే స‌క్సెస్ రేటు ఉండేది. కానీ గ‌త ఏడాది అది 8-10 శాతానికి పెర‌గ‌డం ఊహించ‌ని ప‌రిణామం. మన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆలోచ‌న‌ల్లో కంటెంట్ పెరిగింద‌ని ఆ రిజల్ట్ చెప్పింది.

అది స‌రే.. ఈ నెలాఖ‌రున రిలీజ్ బ‌రిలో దిగిపోతున్నామ‌ని నాగ‌చైత‌న్య - మారుతి అండ్ గ్యాంగ్ చాలా ముందే ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 31న ఈ కాంబినేష‌న్‌ లో `శైల‌జారెడ్డి అల్లుడు` రిలీజ్‌ కి వ‌స్తోంది. నాగార్జున త‌ర‌హాలో చైతూలోని మాస్ ఇమేజ్‌ - రొమాంటిక్ హీరో యాంగిల్‌ ని ఎలివేట్ చేసేందుకు తీసిన సినిమా ఇది. అల్ల‌రి అల్లుడు త‌ర‌హా విజ‌యం ఆశిస్తోంది టీమ్‌. ఈ సినిమాకి అనూబేబి గ్లామ‌ర్ ఓ అస్సెట్ అనుకుంటే - శైల‌జ అత్త‌గా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అభిన‌యంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి.

అయితే ఈ సినిమాకి పోటీ లేదా? అంటే.. ఒక‌రోజు ముందే పోటీకి దిగుతున్నాడు నాగ‌శౌర్య‌. ఉన్న‌ట్టుండి శౌర్య న‌టించిన `న‌ర్త‌న‌శాల‌` బిగ్‌ లీగ్‌ లోకి వ‌చ్చి చేరింది. శౌర్య అస‌లే దూకుడుమీదున్నాడు. ఛ‌లో - అమ్మ‌మ్మ‌గారిల్లు చిత్రాల‌తో బంప‌ర్‌ హిట్లు అందుకుని ఇప్పుడు హ్యాట్రిక్‌ పైనా క‌న్నేశాడు. ఆగ‌స్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా న‌ర్త‌న‌శాల‌ రిలీజ్ కు ఏర్పాట్లు సాగిపోతున్నాయ్‌. ఓవ‌ర్సీస్‌ లో యువ‌హీరోల హ‌వా సాగుతున్న వేళ `ఛ‌లో` చిత్రంతో విదేశాల్లో శౌర్య‌ ఇమేజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు మ‌రోసారి అత‌డి హ‌వా సాగుతుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్‌ కి ఒక‌రోజు ముందే న‌ర్త‌న‌శాల‌ను రిలీజ్ చేస్తున్నామ‌ని పోస్ట‌ర్ సాక్షిగా ప్ర‌క‌టించారు. దీంతో శైల‌జారెడ్డి అల్లుడుకి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ మొద‌లైన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News