'రేస్' డైరెక్ట‌ర్ల‌కు 'క‌ల్కి' రైట‌ర్ క‌థ‌!

Update: 2019-07-07 04:20 GMT
టాలీవుడ్ లో స్టార్ రైట‌ర్లు ఎంద‌రు? అంటే ఓ డ‌జ‌ను పేర్లు మించి చెప్ప‌లేం. ప‌రుచూరి సోద‌రులు- విజ‌యేంద్ర ప్ర‌సాద్- కోన వెంక‌ట్- గోపిమోహ‌న్-అనీల్ రావిపూడి- వ‌క్కంతం వంశీ- కొర‌టాల శివ - మ‌రుధూరి రాజా- ఆకుల శివ‌.. ఇలా కొంద‌రి పేర్లు మాత్ర‌మే స్ట్రైక్ అవుతాయి. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో పెద్ద రేంజులో ర‌చ‌యిత‌లుగా ఎవ‌రున్నారు? అంటే తెలిసిన పేర్లు త‌క్కువే. చాలా మంది డైరెక్ట‌ర్లు ర‌చ‌యిత‌లుగానూ ప్ర‌తిభ చూపిస్తున్నారు కాబ‌ట్టి అలాంటి వాళ్ల‌ను వ‌దిలేస్తే న‌వ‌త‌రంలోనూ కొంద‌రు ర‌చ‌యిత‌లు షైన్ అవుతున్న వాళ్లు ఉన్నారు. ఆ కోవ‌లోనే మ‌రో కొత్త పేరు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇటీవ‌లే క‌ల్కి సినిమాకి క‌థ అందించారు సాయితేజ్ దేశ‌రాజ్. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు క‌థ ఇచ్చిన సాయితేజ్ ఈ క‌థ కోసం చాలానే క‌స‌ర‌త్తు చేశాడ‌ట‌. అత‌డి నేప‌థ్యం ఆస‌క్తిక‌రం. త‌న స్వ‌గ‌తం గురించి  సాయితేజ్ మాట్లాడుతూ-`` మహబూబ్‌ నగర్ జిల్లా నుంచి వ‌చ్చాను. నాకు చిన్నప్పటి నుండి రైటింగ్‌ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌ తో ఎన్నో కథలు రాసేవాణ్ణి. కానీ వాటిని ప్రచురించడానికి లేదా సమాజంలోకి తీసుకెళ్లడానికి సరైన మాధ్యమం లేదు. వాటిని ఒక బుక్‌ రూపంలో తీసుకురావడానికి చాలా డబ్బు అవసరమవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ క్ర‌మంలోనే ఆన్‌లైన్‌లో `కహానిడాట్‌ కామ్‌` అనే ఒక వెబ్‌ సైట్‌ ను చూశాను. అందులో ఫ్రీగా మీ కథలు రాయొచ్చు అని చదివి వెంటనే కథ రాయడం మొదలుపెట్టాను. అలా నేను రాసిన మొదటి కథే కల్కి. ఈ కథను నేను దాదాపు ఆరు నెలలపాటు 46 ఎపిసోడ్స్‌ గా రాశాను. ఆ వెబ్‌ సైట్‌ లో కల్కి కథ ఎక్కువ ప్రాధాన్యం పొందింది. ఆ తరువాత ఆ వెబ్‌ సైట్‌ ఓనర్‌ పల్లవ్‌ అనే వ్యక్తి నన్ను ప్రశాంత్‌ వర్మకు పరిచయం చేశారు. అటుపై అ! సినిమాకు అసోసియేట్‌ రైటర్‌ గా పని చేశాను. ఆ జర్నీలోనే ఏదైనా మంచి కథ ఉందా రాజశేఖర్‌ గారికి అన్నారు. అప్పుడు కల్కి కథ గురించి చెప్పాను. దాదాపు మూడున్నర గంటల నేరేషన్‌ ఇచ్చాను. ఆయనకు నచ్చడంతో వెంటనే వెళ్లి రాజశేఖర్‌ గారికి క‌థ వినిపించారు.

క‌ల్కి క‌థ‌ చాలా అద్భుతంగా ఉంది అని ప్రేక్షకులు.. విశ్లేషకులు ప్రశంసించడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువగా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ గురించే మాట్లాడుతున్నారు కథ రాసుకునే సమయం లొనే ఆ ట్విస్ట్ అందరికి నచ్చుతుంది అని నేను నమ్మాను. ఇంత తక్కువ టైమ్ లో పెద్ద బేనర్‌ పేరు మీదుగా ఒక యంగ్‌ డైరెక్టర్‌ ద్వారా నా కథ సెట్స్ కెళ్లినందుకు సంతోషంగా ఉంది. ఈ స‌క్సెస్ నేప‌థ్యంలోనే మ‌రో వారంలో నేను రాజశేఖర్‌ గారికి మరో కథ చెప్పబోతున్నాను. అది మంచి ఎమోషన్‌ తో కూడిన కాప్‌ థ్రిల్లర్‌. ఆయనకు తప్పకుండా నచ్చుతుంద‌నుకుంటున్నా. నా జ‌ర్నీలో స్నేహితుల సాయంతో ముంబై వెళ్లి `రేస్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అబ్బాస్‌ మస్తాన్‌ కి కథ చెప్పాను. వారికి కూడా కథ నచ్చింది. త్వరలోనే వారి నుండి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాను.. అని తెలిపారు. ఒక చిన్న స్థాయి నుంచి రైట‌ర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద క‌ల‌ల్ని నెర‌వేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సాయితేజ్ కి ఆల్ ది బెస్ట్.


Tags:    

Similar News