మోదీ బ‌యోపిక్ ఫ్లాప్‌.. మన్మోహన్ బ‌యోపిక్ హిట్టు!

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో దిగ్గ‌జ న‌టుడు అనుపమ్ ఖేర్ నటించారు.

Update: 2024-12-27 04:34 GMT

భార‌త‌దేశాన్ని ప్ర‌స్తుతం ప‌రిపాలిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ఎన్నో బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. కానీ అవేవీ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. వివేక్ ఒబెరాయ్ ఇంత‌కుముందు మోదీ బ‌యోపిక్ లో న‌టించ‌గా ప‌లు భాష‌ల్లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. పి.ఎం.న‌రేంద్ర మోదీ పేరుతో వ‌చ్చిన ఈ బ‌యోపిక్ ప్ర‌జ‌ల్ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

 

కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బ‌యోపిక్ ఊహించ‌ని రీతిలో పెద్ద విజ‌యం అందుకుంది. ఈ సినిమా అనేక వివాదాలను తెర‌పైకి తెచ్చింది. రాజకీయంగా ప్ర‌కంప‌నాలు సృష్టించింది. దీంతో వివాదాల‌తో ప్ర‌చారం క‌లిసొచ్చి సినిమా పెద్ద హిట్ట‌యింది. మ‌న్మోహ‌న్ జీవితం ఆధారంగా బాలీవుడ్ బయోపిక్ ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్ ఐదేళ్ల క్రితం విడుదలైంది.

ఈ చిత్రంలో సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలాన్ని తెర‌పై ఆవిష్క‌రించారు. ఆయ‌న‌ను 'రిమోట్-కంట్రోల్డ్' ప్రధానమంత్రిగా చిత్రీకరించడం స‌హా ప్ర‌తిదీ వివాదంగా మారింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించిన కార‌ణంగా వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాలో మన్మోహన్ సింగ్‌ను సోనియా గాంధీ ఎక్కువగా ప్రభావితం చేసినట్లు చూపించడం కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పించింది. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కోసం మ‌న్మోహ‌న్ ను ఎలా పక్కన పెట్టారో కూడా తెరపై చూపించ‌డం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ సినిమాలో కొన్నిటిని రాజకీయ ప్రత్యర్థులు తమ విమర్శలలో తరచుగా ఉపయోగించే అంశాల‌నే చూపారు. ఈ చిత్రం సింగ్‌ను తప్పుగా చిత్రీకరించిందని కాంగ్రెస్ నాయకులు సీరియ‌స్ అయ్యారు. పార్టీ అభ్యంత‌రాలు లేవనెత్తింది. అయితే ఈ వివాదాలే సినిమా విజ‌యానికి క‌లిసొచ్చాయి. మూవీలో ఏం ఉందో చూడాల‌న్న ఉత్సుక‌త‌తో జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. అలా మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ పెద్ద తెర‌పై హిట్ కొట్టింది.

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో దిగ్గ‌జ న‌టుడు అనుపమ్ ఖేర్ నటించారు. సింగ్ సిగ్నేచ‌ర్ మార్క్ హావ‌భావాలు, రూపం, మాట్లాడే విధానంతో అనుప‌మ్ పాత్ర‌కు జీవం పోసారు. నిజంగా రాజనీతిజ్ఞుడైన మ‌న్మోహ‌న్ కి మ‌రో ఆప్ష‌న్ లేదు అనేంత‌గా అనుప‌మ్ ర‌క్తి క‌ట్టించార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శంసించారు. ఖేర్ అసాధారణమైన నటన‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రంలో సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్, రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్ , ప్రియాంక గాంధీగా అహానా కుమ్రా తమ పాత్రలలో చెప్పుకోదగ్గ నటనతో ఆక‌ట్టుకున్నారు. విజయ్ గుట్టే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ బోహ్రా - ధావన్ నిర్మించారు. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మ‌న్మోహ‌న్ క‌న్నుమూత‌:

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖులు, ఆయ‌న అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

Tags:    

Similar News