హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతున్న 'సలార్'..!

Update: 2021-09-25 03:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ క్యాస్టింగ్ - అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకముందెన్నడు లేని హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

'మ్యాట్రిక్స్' 'బ్యాట్ మ్యాన్' వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో ''సలార్'' చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్.. సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన ''సలార్'' మూవీ ఫస్ట్ లుక్ భారీ స్పందన తెచ్చుకుంది. ప్రభాస్ ను గ్యాంగ్ స్టర్ తరహా లుక్ లో సరికొత్త అవతారంలో పరిచయం చేసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందరినీ ఆశ్చర్య పరిచాడు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

'సలార్' చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే బ్యానర్ లో తెరకెక్కిన 'కేజీయఫ్-2' చిత్రాన్ని ఏప్రిల్ 14న షెడ్యూల్ చేశారు. దీంతో 'సలార్' విడుదల తేదీని మార్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News