KGF 2 ప్రభావం సలార్ - పుష్ప 2 లపై బలంగా పని చేస్తోందా? 2023 వేసవికి ఆ రెండు సినిమాలు రావడం కష్టమేనా? అంటే అవుననే విశ్లేషణ సాగుతోంది. ప్రభాస్ నటిస్తున్న సాలార్ .. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలలు ఆలస్యం కానున్నాయని తాజా సన్నివేశం చెబుతోంది.
దీనికి కారణం కేజీఎఫ్ 2 ఇంపాక్ట్. రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF సిరీస్ మాస్ సినిమాను మరో లెవల్లో పునర్నిర్వచించింది. భారీ ఎలివేషన్ సన్నివేశాలు.. పంచ్ డైలాగ్ లు.. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులపై ఎంతగా ప్రభావం చూపుతాయంటే మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సాధారణ లేదా రొటీన్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను సంతృప్తి పరచడం దర్శకనిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది.
మరో రకంగా చెప్పాలంటే తెలిసీ తెలియక సినిమాలను కేజీఎఫ్ సిరీస్ తో పోల్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు తాజా పెద్ద బడ్జెట్ సినిమాల స్క్రిప్ట్ లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు తీస్తున్న మేకర్స్ పై ఇది విపరీతమైన ఒత్తిడి ని పెంచుతోంది. యావరేజ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం కాబట్టి పెద్ద సినిమాలు తీసేవారు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.
నిజానికి ఈ ఒత్తిడి ప్రశాంత్ నీల్ పై ఉన్నందున ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న `సలార్` అంతకంతకు ఆలస్యమవుతోందని సమాచారం. మూవీ విడుదల ప్రణాళికలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని గుసగుస వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదలవుతుందా లేదా! అనేది చెప్పలేమనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. అదేవిధంగా అల్లు అర్జున్ `పుష్ప 2` విడుదల వాయిదాకు వెళుతుంది. ఈ చిత్రం 2023 మిడిల్ లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్క్రిప్టు దశలోనే కంటెంట్ పరంగా పెద్ద రేంజుకు వెళుతున్నారు. భారీ తనం నిండి సీన్ల కోసం బడ్జెట్లను పెంచుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే పాన్ ఇండియా ప్రయత్నం అన్నివేళలా వర్కవుటవుతుందా? అంటే కొన్ని సందేహాలున్నాయి. నేటి రోజుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మహమ్మారి అనంతర కాలంలో సినీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకుల ఎంపికలు మారాయి. సినిమా గురించి చాలా మంచి టాక్ వస్తే కానీ థియేటర్లకు రావడం లేదు.. దీని ప్రభావం పాన్ ఇండియా చిత్రాలకు తొలి రోజు టాక్ పై ఆధారపడి ఉంటుందని పరిశ్రమ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్ లో సౌత్ స్టార్స్ ఆదరణ పొందడం ఒక మంచి పరిణామం. సరైన బడ్జెట్ మార్కెటింగ్ తో ఏ ఫిల్మ్ మేకర్ అయినా పాన్-ఇండియా సినిమాని తీయగలడు. కానీ ఒక్కోసారి కంటెంట్ ఆశించిన మార్క్ కు అనుగుణంగా లేకుంటే వ్యాపారంలో నష్టాలు రావొచ్చు అని కూడా విశ్లేషిస్తున్నారు.
``ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలను విడుదల చేయడం కూడా దర్శకనిర్మాతలకు సవాలుగా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఓటీటీ నిర్మాతలకు మరొక ఆదాయ వనరుగా మారినప్పటికీ కొద్దిపాటి ప్రతికూల సమీక్షలు లేదా సగటు కంటెంట్ చిత్రం త్వరగానే డిజిటల్ ప్లాట్ ఫారమ్ లోకి వస్తుందని ప్రేక్షకులు గ్రహించడం వల్ల భారీ నష్టాన్ని చవిచూడవచ్చు`` అని ఒక ఎగ్జిబిటర్ విశ్లేషించారు.
తాజాగా సుదీప్ నటించిన పాన్-ఇండియా చిత్రం `విక్రాంత్ రోనా` .. రణబీర్ నటించిన శంషేరా చిత్రాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాల్సి ఉంది. వీటి ఫలితాలు పాన్ ఇండియా ఆలోచనలపై ఏ తీరుగా పని చేస్తాయో కూడా విశ్లేషించాల్సి ఉంటుంది.