సల్మాన్-షారుఖ్.. 60 కోట్లకు ముంచారు

Update: 2017-08-17 07:32 GMT
నరేంద్ర హిరావత్.. బాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూటర్లలో బాగా ఫేమస్. ఎన్.హెచ్ స్టూడియోస్ అనే డిస్ట్రిబ్యూషన్ హౌస్ పేరు మీద హిందీ సినిమాల్ని పంపిణీ చేస్తుంటాడు. బాలీవుడ్లో వచ్చే భారీ బడ్జెట్ సినిమాల మీద ఎప్పుడూ ఆయన కన్నుంటుంది. అందులోనూ ఖాన్ త్రయం సినిమాలంటే ఆయన హ్యాండ్ ఉండాల్సిందే. గతంలో ఎన్నో భారీ సినిమాల్ని పంపిణీ చేసిన చరిత్ర హిరావత్ కు ఉంది. ఐతే ఆయన ఈ మధ్య ఇద్దరు ఖాన్స్ ను నమ్ముకుని ఏకంగా రూ.60 కోట్లకు మునిగిపోయాడు. దీంతో అతడి డిస్ట్రిబ్యూషన్ సంస్థనే మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఖాన్స్ ఇద్దరూ ఆదుకోకుంటే తన పరిస్థితి అగమ్య గోచరమే అంటూ ఆవేదన చెందుతున్నాడు హిరావత్.

రంజాన్ కానుకగా జూన్ నెలలో విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’.. ఈ నెల ఆరంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’.. ఈ రెంటినీ తన సంస్థ ద్వారా పంపిణీ చేశాడు నరేంద్ర హిరావత్. ఐతే ఈ రెండు సినిమాలూ డిజాస్టర్లయ్యాయి. బయ్యర్లందరికీ దారుణమైన నష్టాల్ని మిగిల్చాయి. ముఖ్యంగా నరేంద్ర హిరావత్ అందరిలోకి ఎక్కువ నష్టపోయాడు. ఆ నష్టం రూ.60 కోట్లని అంటున్నాడతను. షారుఖ్.. సల్మాన్ ఇద్దరితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని.. వీళ్లిద్దరి సినిమాలు చాలానే తాను డిస్ట్రిబ్యూట్ చేశానని.. ఇప్పుడు వాళ్లు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. తనను ఆదుకుంటారని వాళ్ల మీద నమ్మకం ఉందని కూడా చెబుతున్నాడు. ఐతే షారుఖ్ సంగతేమో కానీ.. సల్మాన్ మాత్రం తన సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లకు రూ.33 కోట్ల దాకా పరిహారం ఇస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ నరేంద్ర మాత్రం ఇంకా తనకు పరిహారం అందలేదని అంటున్నాడు. ఈ విషయమై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ను అడిగితే.. పరిహారం అందజేసే ప్రక్రియ నడుస్తోందని.. నష్టపోయిన వాళ్లకు కచ్చితంగా కొంత మేర పరిహారం అందుతుందని చెప్పాడు.
Tags:    

Similar News