అతడి కోసం పిలవని పేరంటానికి వెళ్లాడు

Update: 2016-11-21 06:47 GMT
సినిమా హీరోలకు లక్షలాదిగా అభిమానులు ఉంటారు. తమ అభిమాన కథానాయకుడ్ని ఎంతలా అభిమానిస్తారో చెప్పాల్సిన అవసరం ఉండదు. సెలబ్రిటీలు సైతం కొందరు నటుల్ని విపరీతంగా అభిమానిస్తారు.. అంతకు మించి ఆరాధిస్తారు. వారి కోసం తమ స్టార్ స్టేటస్ వదిలేసి మరీ సామాన్యుల మాదిరి వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉండే మేనియా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయనకున్న క్రేజ్ అంతాఇంతా కాదు.

సామాన్యులే కాదు.. అసమాన్యులు సైతం ఆయన్ను విపరీతంగా ఆరాధిస్తుంటారు. ఆయనకున్న అభిమానగణంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరట. రజనీ తాజా చిత్రం రోబో 2.0 సినిమాకు సంబంధించిన కార్యక్రమం ముంబయిలో జరిగింది. రజనీని కలిసేందుకు అవకాశం ఉండటంతో తనకు ఇన్విటేషన్ లేకున్నా.. కేవలం సూపర్ స్టార్ కోసం తానీ కార్యక్రమానికి వచ్చినట్లుగా చెప్పిన సల్మాన్ అందరిని సర్ ప్రైజ్ చేశారు.

దక్షిణాది నటుల్ని ఉత్తరాది నటులు చులకనగా చూస్తారన్న ఆరోపణ తరచూ వినిపిస్తుంటుంది. ఇలాంటివి విన్నప్పుడు కాసింత బాధ కలుగుతుంది. అయితే.. సల్మాన్ తాజా మాటల్ని చూసినప్పుడు.. మన సూపర్ స్టార్ కోసం మరో సూపర్ హీరో.. తన స్టార్ డమ్ ను వదిలేసి.. పిలవని పేరంటానికి వచ్చి మరీ తన అభిమానాన్ని ప్రదర్శించటం చూస్తే.. ఫ్యాన్ అంటే అంతేమరి అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News