ఈ దెబ్బతో ఆల్ ఇండియా స్టారైపోయాడు

Update: 2016-07-11 09:24 GMT
మంచి టైమింగ్ అన్నది ఓ సినిమాకు ఎంత బాగా కలిసొస్తుందో ‘సుల్తాన్’ సినిమా రుజువు చేస్తోంది. ప్రతి రంజాన్ సీజన్ కూ తన సినిమా తప్పక ఉండేలా చూసుకుంటున్న సల్మాన్ కు.. ఈసారి పండుగతో పాటు చాలా అంశాలు కలిసొచ్చి ‘సుల్తాన్’ అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది. ఐదు రోజుల లాంగ్ వీకెండ్లో ఈ సినిమా దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఇండియన్ సినిమాలో వీకెండ్ రికార్డు బద్దలైపోయినట్లే.

గత ఆరు నెలల్లో బాలీవుడ్లో ‘సుల్తాన్’ స్థాయి భారీ సినిమా ఇంకేదీ రాలేదు. వంద కోట్ల వసూళ్లు సాధించడమే గొప్ప అనుకునే పరిస్థితి. పెద్ద హీరో నటించిన మంచి మాస్ సినిమా కోసం ఆవురావురని చూస్తున్న టైంలో ‘సుల్తాన్’ రిలీజైంది. ఇంకేముంది కలెక్షన్ల సునామీ కనిపిస్తోంది బాక్సాఫీస్ దగ్గర. ఐతే సల్మాన్ సినిమాలు నార్త్ ఇండియాలో ఆడటం మామూలే కానీ.. సౌత్ లో కూడా ఇరగాడేయడం ఇప్పుడే చూస్తున్నాం. ‘సుల్తాన్’ వసూళ్లు అంచనాలకు మించి ఉండటానికి ఇది కూడా ఒక కారణం.

గత వారాంతంలో తెలుగులో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా జోరు తగ్గించేశాయి. అసలు కొంత కాలంగా తెలుగులో భారీ సినిమాలేమీ లేవు. మరోవైపు తమిళంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. సంతానం సినిమా ‘దిల్లుకు దుడ్డు’ మినహా లాస్ట్ వీకెండ్ చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో.. తమిళనాట కూడా ‘సుల్తాన్’ భారీ వసూళ్లు సాధించింది. ఇక కర్ణాటకలోని బెంగళూరు..మంగళూరు లాంటి నగరాల్లో ఎప్పుడూ హిందీ సినిమాలు బాగానే ఆడతాయి. మొత్తానికి ‘సుల్తాన్’ సినిమాతో సౌత్ లోనూ వసూళ్ల ప్రభంజనం సాగించి.. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు సల్మాన్.
Tags:    

Similar News