పెళ్లి త‌ర్వాత ఆఫర్స్ రావ‌నే అనుకుందట..!

Update: 2020-12-16 00:30 GMT
అక్కినేని సమంత సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా దశాబ్దకాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 'ఏమాయ చేసావే' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత.. విలక్షణమైన పాత్రలతో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. తన మొదటి హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. సహజంగా వివాహం అనంతరం నటీమణులకు హీరోయిన్ అవకాశాలు రావని అంటుంటారు. అయితే సామ్ మాత్రం పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌ కు అడ్డంకి కాద‌ని నిరూపిస్తోంది. సినిమాలతోనే కాకుండా హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ అదరగొడుతోంది.

తాజాగా సమంత టాక్ షో లో మాట్లాడుతూ పెళ్లి త‌ర్వాత అవ‌కాశాల‌పై ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించింది. హీరోయిన్ల కెరీర్ కి వివాహం అడ్డంకి కాదని నిరూపించాల‌నో లేదా అలాంటి అపోహ‌ను తొల‌గించాల‌నే ఆలోచ‌న‌తో తాను కెరీర్ ప్రారంభించ‌లేద‌ని సామ్ చెప్పుకొచ్చింది. పెళ్లి త‌ర్వాత అవ‌కాశాలు రావ‌నే అనుకున్నానని స‌మంత తన మనసులో మాట బయటపెట్టేసింది. సినిమా అవ‌కాశాలు రావని డిసైడై పెళ్లికి సిద్ధ‌ప‌డిన‌ట్టు చెప్పి అందరినీ ఆశ్చ‌ర్య పరిచింది. తాను అదృష్టవంతురాలునని.. పెళ్లి తర్వాత 'రంగస్థలం' 'మహానటి' 'ఓ బేబీ' లాంటి సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని స‌మంత ఆనందం వ్యక్తం చేసింది. కాగా, సామ్ గతేడాది 'సూపర్ డీలక్స్' 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాల్లో నటించి అలరించారు. ఈ ఏడాది 'జాను'తో పలకరించిన సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. అలానే తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి నటిస్తోంది.
Tags:    

Similar News