హీరోయిన్లేం పాపం చేశారు కొరటాలా?

Update: 2016-09-02 11:30 GMT
కొరటాల శివ తొలి సినిమా ‘మిర్చి’లో అటు అనుష్క.. ఇటు రిచా గంగోపాధ్యాయలిద్దరికీ మంచి రోల్సే పడ్డాయి. సినిమాలో వారి పాత్రలు కీలకం. కథలో కీలక మలుపులకు వారి పాత్రలు కారణమవుతాయి. ఇక ‘శ్రీమంతుడు’లో శ్రుతి హాసన్ పాత్ర కూడా అంతే. ఆమె పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. దీంతో ‘జనతా గ్యారేజ్’లోనూ హీరోయిన్లు కీలకమవుతారని అనుకున్నారంతా. సమంత.. నిత్యా మీనన్ లాంటి మంచి పెర్ఫామర్లను తీసుకోవడంతో వారి పాత్రలపై చాలా ఆశలు.. అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆశ్చర్యకరంగా సినిమాలో వీరి పాత్రలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఇద్దరివీ ఇందులో వృథా పాత్రలే.

ఎన్టీఆర్-సమంతలను బావా మరదళ్లుగా.. లవర్స్ గా చూపించాడు కొరటాల. ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ కెమిస్ట్రీ పండించడానికి అవకాశమున్నా.. కొరటాల ఉపయోగించుకోలేకపోయాడు. లవ్ స్టోరీని చాలా పేలవంగా నడిపించాడు. ప్రేమకథలో అసలు డెప్త్ లేదు. నాలుగైదు సన్నివేశాల్లో వీళ్ల ఎపిసోడ్ ను ముగించేశాడు. ప్రథమార్ధంలో ఒకసారి సమంత పాత్ర ముగిసిపోయాక.. మిగతా గంటన్నర ఆమె కనిపించేది ఓ నాలుగు నిమిషాలు మాత్రమే. అందులోనూ ఒక చిన్న డైలాగ్.. ఒకటిన్నర నిమిషం పాట ఉంటుందంతే. పోనీ నిత్యా మీనన్ పాత్ర అయినా ప్రత్యేకంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఆమె పాత్ర ఇంకా మోసం. పాత్రలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప ఓకే చేయని నిత్యా.. ఇలాంటి పాత్రను ఎలా ఎంచుకుందన్నది సందేహం కలిగించే విషయమే. మొత్తానికి హీరోయిన్ల పాత్రల విషయంలో కొరటాల ఈసారి తీవ్రంగా నిరాశ పరిచాడు.
Tags:    

Similar News