పచ్చబొట్టు మీద మోజు తీరింది.. అసలే వద్దంటుంది

Update: 2022-04-18 04:13 GMT
కాలం మన చేతిలో ఉండదన్న సత్యాన్ని బ్యూటీ సామ్ బాగానే అర్థం చేసుకున్నట్లుగా ఉంది. తాజాగా ఆమె చెప్పిన మాటల్ని వింటే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఒంటి మీద టాటూ వేయించుకోవటం ఇప్పుడో ట్రెండ్ గా మారింది. గతానికి భిన్నంగా ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు చోట్ల టాటూలు వేయించుకోవటం చూస్తుంటాం. ఇక.. సెలబ్రిటీలు.. సినీ తారల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

కొందరు నటీనటులైతే టాటూలతో ఫేమస్ అయినోళ్లు ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు సీనియర్ నటి త్రిషనే తీసుకుంటే.. ఎద పై భాగంలో ఆమె వేయించుకున్న టాటూ ఎంతటి సంచలనానికి కారణమైందో తెలిసిందే. నిజానికి అప్పట్లో టాటూ కల్చర్ అంతగా లేదు. అలాంటి వేళలో.. ఏకంగా ఎద పైభాగంలో కనిపించి కనిపించనట్లుగా ఉండే ఆమె టాటూ అందరూ మాట్లాడుకునేలా చేసింది.

ఇక.. బ్యూటీ సమంత విషయానికి వస్తే.. ఆమె ఒంటి మీద మొత్తం మూడు టాటూలు ఉండటం తెలిసిందే. ఈ మూడు కూడా విడిపోయిన భర్త నాగచైతన్య గురుతుగా అని మాత్రం చెప్పాలి. అందులో మొదటిది ఆమె నటించిన తొలిచిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన ఏం మాయ చేశావే.. గుర్తుగా వైఎంసీ పేరుతో వీపు మీద ఒక టాటూ వేయించుకుంది. ఆ తర్వాత చైతో ఉన్న తన అనుబంధానికి గుర్తుగా నడుము పై భాగంలో చై అనే పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది.

ఇక.. కుడి చేతి మీద వేయించుకున్న రెండు యారో మార్కులు.. ఎంతో మంది సామ్ ను ఫాలో అయ్యేలా చేశాయి. ఈ యారో మార్కులు వేయించుకోవటం ఒక ట్రెండ్ గా మారాయి. నీ లైఫ్ ను నువ్వు చూసినట్లుగా ఉంటుందే తప్పించి ఇతరులు చూసినట్లు కాదన్న అర్థం వచ్చేలా ఉన్న ఇదే తరహా టాటూను నాగ చైతన్య కూడా వేయించుకోవటం తెలిసిందే.

భర్త నాగచైతన్యతో విడిపోయిన సమంత.. ఆ బంధానికి గుర్తుగా మాత్రం ఒంటి మీద టాటూల రూపంలో అలానే ఉండిపోయాయి. ఇటీవల మీరు వేయించుకోవాలనుకునే టాటూ ఏమిటన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. తనకు ఎలాంటి టాటూలు వేయించుకోవాలని లేదన్న విషయాన్ని వెల్లడించటం గమనార్హం.

నిజమే.. కాలం తెచ్చే మార్పులు జీవితాల్ని చాలానే మార్చేస్తాయి. కానీ.. ఒంటి మీద వేయించుకున్న టాటూ మాత్రం అలానే ఉండిపోతుంది. మారే రోజులకు అనుగుణంగా ఉండని టాటూలతో ఇబ్బందే. ఇదే విషయాన్ని సామ్ కు అనుభవపూర్వకంగా అర్థమైందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News